భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు మొదటి రోజు విరాట్ కోహ్లీ వికెట్ వార్తల్లో నిలుస్తోంది. విరాట్ కోహ్లీ అవుట్ కాదేమో అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్లో విరాట్ కోహ్లీని ఫీల్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించారు. అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని విరాట్ డీఆర్ఎస్‌కు వెళ్లాడు. రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకిందని తేలినప్పటికీ.. మొదటి బ్యాట్‌కు తగిలిందా.. ప్యాడ్‌కు తగిలిందా అనే విషయంపై స్పష్టత రాలేదు.


సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున్న దుమారం చెలరేగుతుంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అది నాటౌట్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై భారత మాజీ పేస్ బౌలర్ ఆర్పీ సింగ్ కూడా స్పందించారు. అది చెడ్డ నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. సినిమా నటుడు పరేష్ రావల్ అయితే ఇది థర్డ్ అంపైరా.. థర్డ్ క్లాస్ అంపైరా.. అని ట్వీట్ చేశారు.


ఇక స్కోరు విషయానికి వస్తే.. మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (123 బ్యాటింగ్: 246 బంతుల్లో, 12 ఫోర్లు, మూడు సిక్సర్లు) సెంచరీ సాధించాడు. మయాంక్‌కు తోడుగా వృద్ధిమాన్ సాహా (25 బ్యాటింగ్: 53 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ (44: 71 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. పుజారా, కోహ్లీ ఇద్దరూ డకౌటయ్యారు. పడిన నాలుగు వికెట్లూ అజాజ్ పటేల్‌కే దక్కాయి.