ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. శనివారం ఉదయం బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కుప్పకూలిపోయారు. ఆయనను కుటుంబసభ్యులు స్టార్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మార్గంమధ్యలోనే రోశయ్య కన్నుమూశారని వైద్యులు నిర్ధారించారు. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న రోశయ్య గత కొంతకాలం నుంచి ఇంటికి పరిమితమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కీలక నేత అయిన రోశయ్య మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలిపారు.
రోశయ్య మరణం తీరని లోటు అని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Also Read: Rosaiah Passes Away: తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !
‘పెద్దలు రోశయ్య మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని’ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: Konijeti Rosaiah Death: మాజీ గవర్నర్ రోశయ్య కన్నుమూత.. ప్రముఖుల సంతాపం