కస్తూరీబా బాలిక విద్యాలయాల్లో ఉపాధ్యాయ నియామకాల కోసం నోటిఫికేషన్ వచ్చింది. 958 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలును విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి పారదర్శకతతో మెరిట్‌ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్టు పేర్కొంది. ఈ ఉద్యోగాలను పూర్తిగా మహిళకే కేటాయిస్తూ గురువారమే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం విద్యాశాఖ విడుదల చేసింది. 


కేజీబీవీల్లో టీచింగ్ స్టాఫ్‌ కోసం గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. విద్యార్హత, ఎక్స్‌పీరియన్స్‌, మెరిట్ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని.. ప్రకటించిన విద్యాశాఖ... భర్తీ విధానం, ఇతర వివరాలను ప్రకటించింది. పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు పార్ట్‌టైం, మిగతా ఉపాధ్యాయులను కాంట్రాక్టు విధానంలో నియమించనున్నారు. 
కేజీబీవీల్లో పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు పని చేసేందుకు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ పూర్తైన తర్వాత నేరుగా వారికి కేటాయించిన కేజీబీవీలో జాయిన్ కావాలి. అక్కడే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. సంతకం చేసిన రోజు నుంచి విద్యాసంవత్సరం చివరి రోజు వరకు ఒప్పందం ఉంటుంది. ఆ తర్వాత ఆ టీచర్‌ పని తీరుపై సంతృప్తిగా ఉంటే కొనసాగిస్తారు. లేదంటే వారిని తప్పించి వేరే వాళ్లను నియమిస్తారు. ఒక వేళ కొనసాగిస్తే మళ్లీ ఏడాది పాటు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.  విద్యాసంవత్సరం మధ్యలో ఎప్పుడైనా తప్పించే అధికారులు ప్రభుత్వానికి ఉంటుంది. ఆరోపణలు వచ్చినా... బోధన సరిగా లేదని ఫిర్యాదులు అందినా ముందస్తు నోటీసులు లేకుండానే తప్పించవచ్చు. ఈ పోస్టుల్లో వచ్చే అభ్యర్థులకు క్రమబద్దీకరణ కోరే ఛాన్స్ లేదని నిబంధనల్లో పేర్కొన్నారు. కోర్టుల్లో పిల్స్ వేసే ఛాన్స్ కూడా లేదు. 
ఈ ఉద్యోగాల్లో చేరాలనుకునే వారు రాత్రి పూట కూడా విధులు చేసేందుకు సంసిద్దంగా ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు చెప్పిన టైంలో చెప్పిన స్కూల్స్‌లో జాయిన్‌ కాకపోయినా... 15 రోజుల్లో చేరకపోయినా ఆ నియామకం రద్దు అయిపోతుంది. ఆ తర్వాత మెరిట్ ఉన్న అభ్యర్థికి ఆ పోస్టు కేటాయిస్తారు. కౌన్సెలింగ్ అనంతరం నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి అవుతుంది. 
జిల్లాల వారీగా నియామకాలు చేపడతారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌ నామినేట్‌ చేసే అధికారి ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేస్తారు. రోస్టర్ పాయింట్లు ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయి. అభ్యర్థుల వయసు 2021 జూలై నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. 42 ఏళ్లు దాటి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయసులో సడలింపు ఉంటుంది. వాళ్లకు 47 ఏళ్ల వరకు సడలింపు ఉంది. దివ్యాంగులకు 52 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. 


Also Read:నేవీ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డులో ఉద్యోగాలు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే


Also Read: సీఐఎస్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.... ఇలా దరఖాస్తు చేసుకోండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి