Konijeti Rosaiah Death: మాజీ గవర్నర్ రోశయ్య కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే రోశయ్య తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
మాజీ సిఎం,గవర్నర్ రోశయ్య వంటి నేత రాజకీయాల్లో అరుదుగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత అంబికా కృష్ణ అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవమే కాకుండా, సిఎంలు మెచ్చిన మంత్రిగా రోశయ్య పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో సేవలు చేసారని, ఆయన ఆత్మకు శాంతి ,కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ప్రసాందించాలని కోరారు అంబికాకృష్ణ.
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య మృతి బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కడప జిల్లా వేంపల్లె లోని ఆయన స్వగృహంలో తులసిరెడ్డి దంపతులు రోశయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోశయ్య మృతి బాధాకరమన్నారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారని గుర్తుచేశారు. వివాదరహితుడిగా నిలిచారన్నారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన సేవలనందించారన్నారు. రోశయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు, అభిమానులకు తులసిరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రోశయ్య మరణంపై మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలకు ఓ మంచి వ్యక్తి దూరమవడం బాధాకరం అన్నారు. అసెంబ్లీలో ఇరువురు చాలా కాలం కలిసి పని చేసిన రోజులు గుర్తు చేసుకున్నారు. శాసనసభలో తమ మధ్య జరిగిన చర్చలలో ఎన్నో సందర్భాలలో నవ్వులు పూయించిన సందర్భాలున్నాయని.. వాటిని ఎన్నటికీ మరువలేను అన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని... వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ సిఎం రోశయ్య మరణం పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డానన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కొన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన రాష్ట్రానికి చేసిన ఎనలేని సేవలు ప్రజలకు గుర్తుండే ఉంటాయి. రోశయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శ్రీ వేంకటేశ్వర స్వామి శాంతి కలిగించాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
‘పెద్దలు రోశయ్య మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని’ ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం ప్రకటించారు.
మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఓ రుషి మాదిరిగా సేవ చేశారని కొనియాడారు. అలాంటి నేత రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందని చిరు పేర్కొన్నారు.
రోశయ్య మృతికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య అకాల మరణం షాక్‌కి గురి చేసిందన్నారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని కామెంట్ చేశారు. నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరన్నారు రేవంత్ రెడ్డి. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
తమిళనాడు గవర్నరుగా ఐదేళ్లు పనిచేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన కొణిజేటి రోశయ్య 2016 ఆగస్టు 30 వరకు సేవలందించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు
Background
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య కన్నుమూశారు. ఉదయం లోబీపీ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్లుగా గుర్తిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా ఆయన చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన ఆరోగ్య పరమైన సమస్యలతో ఆయన ఇటీవల ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత రోశయ్యను హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. ఆ తర్వాత పార్టీలో ఏర్పడిన పరిణామాలతో తాను పదవిలో కొనసాగలేనని ఆయన వైదొలిగారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిసీఎం అయ్యారు. సీఎంగా పదవి నుంచి వైదొలిగిన తరవాత రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. 2011 ఆగస్టు 31 నుంచి 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. పదవి కాలం పూర్తయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. రోశయ్య ఎన్.జి.రంగా శిష్యునిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గుంటూరు హిందూ కళాశాలలో చదువుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 1985లో తెనాలి నుంచి 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రోశయ్య ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను 15 సార్లు ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి ఓ సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
Also Read: ఉత్తరాంధ్రపై అధికారుల స్పెషల్ ఫోకస్.. ప్రాణ నష్టం ఉండకూడదన్న సీఎం జగన్
Also Read: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
- - - - - - - - - Advertisement - - - - - - - - -