టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ముంబయిలోని తన ఇంట్లో కుటుంబంతో ఆస్వాదిస్తున్నాడు. అయితే రోజూ మైదానానికి వెళ్లి ప్రాక్టీస్ మాత్రం కొనసాగిస్తున్నాడు. కఠోరంగా సాధన చేస్తున్న అతడిని ఓ చిట్టి అతిథి పలకరించింది. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో తెలుసా?
ఆరు నెలలుగా విరాట్ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడాడు. ఇంగ్లాండ్ పర్యటన కోసం బయో బుడగలోకి అడుగు పెట్టాడు. బ్రిటన్‌లో నాలుగు టెస్టులు ఆడాడు. వెంటనే ఐపీఎల్ రెండో అంచె కోసం దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడా నెలకు పైగా బుడగలోనే ఉన్నాడు. ఆ వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆడాడు. కరోనా భయం వల్ల ఎక్కువ కాలం క్రికెటర్లు బుడగల్లోనే ఆడాల్సి వస్తోంది. దాంతో వారు మానసికంగా అలసిపోతున్నారు.
అలసట కారణంగానే న్యూజిలాండ్‌తో టీ20 సిరీసులో కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. మొదటి టెస్టుకూ దూరంగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం అతడు ముంబయిలోని ఓ మైదానంలో కఠోరంగా సాధన చేస్తున్నాడు. అప్పుడే అతడి వద్దకు ఓ పిల్లి వచ్చింది. సహజంగా జంతు ప్రేమికుడైన విరాట్ వెంటనే దానిని మచ్చిక చేసుకున్నాడు. ఒడిలోకి తీసుకొని కాసేపు నిమిరాడు. తనూ సేద తీరాడు. ఈ విషయాన్ని అతడే ట్విటర్లో పంచుకున్నాడు.
గురువారం నుంచి టీమ్‌ఇండియా కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో తలపడుతోంది. ఇప్పటికే కోహ్లీ, రోహిత్ విశ్రాంతి వల్ల జట్టుకు దూరమయ్యారు. అయితే తొడ కండరాలు పట్టేయడంతో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం సిరీసుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యకుమార్‌ను తీసుకున్నారు.
Also Read: Gambhir on Ravi Shastri: శాస్త్రిపై గౌతీ విమర్శలు.. ద్రవిడ్ సమతూకం బాగుందన్న మాజీ ఓపెనర్
Also Read: Cricketer Dog Viral Video: కుక్క ఫీల్డింగ్ కేక.. ఏకంగా సచిన్ టెండూల్కరే అలా!