2025లో పాకిస్తాన్‌లో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లు పాల్గొంటాయని ఆశిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది. 2025లో జరగనున్న చాంపియన్స్ ట్రోపీ నిర్వహణ బాధ్యతలు పాకిస్తాన్‌కు అప్పగిస్తూ ఐసీసీ గత వారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లో దాదాపు 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీ జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్ పాల్గొనడం కొంచెం కష్టతరమైన అంశమే అయినప్పటికీ.. భౌగోళిక, రాజకీయ ఒత్తిడులను తాము నియంత్నించలేమని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్‌లే తెలిపారు.
గతంలో భారత్, శ్రీలంకలతో కలసి 1996 వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం వహించింది. 2009లో శ్రీలంక జట్టుపై లాహోర్‌లో ఉగ్రదాడి జరిగిన అనంతరం పాకిస్తాన్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కువగా జరగలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని జట్లూ ఈ టోర్నీలో పాల్గొంటాయని తాము ఆశిస్తున్నామని బార్క్‌లే తెలిపారు.
ఎన్నో సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌లో ఐసీసీ టోర్నీ జరుగుతోందని, గత కొన్ని వారాల్లో జరిగిన అంశాల ప్రభావం లేకుండా అన్ని జట్లూ పాల్గొంటాయని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు పాకిస్తాన్ టూర్లను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా ఆ దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టోర్నీ జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి పాల్గొనే దేశాలన్నీ తమకు కావాల్సిన సెక్యూరిటీ ప్లాన్లు తెలిపితే.. దానికి తగ్గట్లు ఏర్పాట్లు జరిగేలా తాము చూసుకుంటామని బార్క్‌లే తెలిపాడు. భారత్‌లో టెర్రర్ దాడుల అనంతరం 2012 నుంచి ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లే జరగడం లేదు. భారత్.. పాకిస్తాన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుందా లేదా అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం సరిగ్గా లేకపోవడం కారణంగా.. ఈ సమస్యలను పరిష్కరించడం కొంచెం కష్టతరమైన పనే అన్నారు. అయితే భౌగోళిక, రాజకీయ ఒత్తిడులను తాము నియంత్రించలేమని తెలిపారు. ఆ దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడటానికి క్రికెట్ సాయపడాలని తాము కోరుకుంటున్నామన్నారు.
Also Read: Ian Chappell on T20 WC: ప్రపంచకప్ టాస్ గెలువు కప్పు కొట్టుగా మారిందన్న ఇయాన్ ఛాపెల్..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి