రెండో రోజు స్పష్టంగా కివీస్‌దే..! ఉదయం టిమ్‌ సౌథీ ఐదు వికెట్లతో అజింక్య సేన వెన్ను విరిచాడు. ఆ తర్వాత ఓపెనర్లు విల్‌ యంగ్‌ (75 బ్యాటింగ్‌; 180 బంతుల్లో 12x4), టామ్‌ లేథమ్‌ (50 బ్యాటింగ్‌; 165 బంతుల్లో 4x4) అజేయ అర్ధశతకాలతో చెలరేగారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 129/0తో నిలిచింది. అంతకు ముందు శ్రేయస్‌ అయ్యర్‌ (105; 171 బంతుల్లో 13x4, 2x6) అరంగేట్రంలోనే శతకంతో ఆకట్టుకున్నాడు. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. 57 ఓవర్లు వేసినా మన బౌలర్లు ఒక్క వికెట్టూ తీయలేదు.


ఓపెనర్లే ఆడేశారు


సొంతగడ్డపై ఆడుతుండటం.. అనుభవజ్ఞులైన బౌలర్లు కావడంతో టీమ్‌ఇండియా కనీసం 3-4 వికెట్లైనా తీస్తుందనే భావించారంతా! కానీ అలాంటిదేమీ జరగలేదు. న్యూజిలాండ్‌ ఓపెనర్లు విల్‌ యంగ్‌, టామ్‌ లేథమ్‌ మన ఆశలు అడియాసలు చేశారు. ఫాస్ట్‌ బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కొన్నారు. స్పిన్‌ బలహీనతనైనా సొమ్ము చేసుకుందామంటే అదీ జరగలేదు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (17), రవీంద్ర జడేజా (14), అక్షర్‌ పటేల్‌ (10) కలిసి 37 ఓవర్లు వేసినా ఓపికగా ఆడారు. తొలి వికెట్‌కు అజేయంగా 129 పరుగుల భాగస్వామ్యం అందించారు. భారత్‌పై కివీస్‌కు ఇది మూడో అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం గమనార్హం.


శ్రేయస్ సూపర్‌


ఓవర్‌నైట్‌ స్కోరు 258/4తో రెండోరోజు, శుక్రవారం టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. నైట్‌ వాచ్‌మన్‌ రవీంద్ర జడేజా (50; 112 బంతుల్లో 6x4) మరో 12 బంతులకే ఔటై నిరాశపరిచాడు. అరంగేట్రం వీరుడు శ్రేయస్‌ అయ్యర్‌ (75 ఓవర్‌నైట్‌ స్కోరు) మాత్రం అద్భుతంగా ఆడాడు. తన దేశవాళీ క్రికెట్‌ అనుభవాన్ని ప్రదర్శించాడు. చూడచక్కని బౌండరీలు బాదేస్తూ 157 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. దాంతో భారత్‌ 94.5 ఓవర్ల వద్ద  300 పరుగుల మైలురాయి అందుకుంది. మరో 5 పరుగులకే అయ్యర్‌ను సౌథీ పెవిలియన్‌ చేర్చడంతో జట్టు కష్టాల్లో పడింది.


అశ్విన్‌ పోరాటం


ఆఖర్లో స్కోరు పెంచేందుకు అశ్విన్‌ (38; 56 బంతుల్లో 5x4) చేసిన పోరాటం ఆకట్టుకుంది. సమయోచితంగా ఆడుతూ ఐదు బౌండరీలు బాదేశాడు. అతడికి ఉమేశ్‌ యాదవ్‌ (10*; 34 బంతుల్లో) అండగా నిలిచాడు. వీరిద్దరూ 26 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే జట్టు స్కోరు 339 వద్ద యాష్‌ను అజాజ్‌ పటేల్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మరికాసేపటికే ఇషాంత్‌ (0)నూ పటేలే ఔట్‌ చేయడంతో భారత్‌ ఆలౌటైంది. అక్షర్‌ పటేల్‌ (3), వృద్ధిమాన్‌ సాహా (1) విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 5, జేమీసన్‌ 3, అజాజ్‌ పటేల్‌ 2 వికెట్లు తీశారు.






Also Read: Test Match Records: 23 ఏళ్లకే శుభ్‌మన్‌ అరుదైన రికార్డు.. సన్నీకి చేరువ అవుతాడా?


Also Read: IPL 2022 Auction: పంజాబ్‌కు రాహుల్‌ షాక్‌..! మోర్గాన్‌, డీకేను వదిలేస్తున్న కోల్‌కతా!


Also Read: Shreyas Iyer Test Debut: వాహ్.. అరంగేట్రంలోనే అదరగొట్టావుగా.. శ్రేయస్‌పై సోషల్‌మీడియా ప్రశంసలు!


Also Read: Bhuvneshwar Kumar Became Father: భువీకి ఆడపిల్ల.. ఈ సంవత్సరం భారత పేసర్‌కు మొదటి గుడ్‌న్యూస్!


Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?


Also Read: 83 Teaser: ‘83’ మూవీ టీజర్.. వచ్చేస్తోంది వరల్డ్ కప్ హిస్టరీ.. హిట్ పక్కా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి