భారత పేస్ బౌలర్ భువీ తండ్రి అయ్యాడు. తన భార్య నుపుర్ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మీరట్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(ఎండీసీఏ) ట్రెజరర్ రాకేష్ గోయల్ మీడియాకు తెలిపారు. అలాగే భువీ కూడా ట్వీట్ చేశారు. భువనేశ్వర్‌కు ఇప్పుడు పుట్టిన ఆడపిల్లే మొదటి బిడ్డ.
బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నుపుర్ ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. 2017, నవంబర్ 23వ తేదీన భువనేశ్వర్, నుపుర్ నాగర్‌లకు పెళ్లి అయింది. వీరిద్దరూ ప్రస్తుతం నోయిడాలోనే నివాసం ఉంటున్నారు. మంగళవారానికి వారి పెళ్లయి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి.
భువనేశ్వర్ టీమిండియాతో ఉండటం కారణంగా ఇంకా భార్యని, పాపని చూడలేదు. గురువారం భువీ తన మొదటి బిడ్డను చూస్తాడని తెలుస్తోంది. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఈ సంవత్సరం భువీ జీవితం కొన్ని ఒడిదుడుకులకు లోనైంది. కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ ఈ సంవత్సరం మేలో మరణించారు. ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే భువీకి అవకాశం దక్కింది. తన మూడు ఓవర్లలో భువీ కేవలం 25 పరుగులు మాత్రమే ఇవ్వగలిగాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు. భారత టెస్టు జట్టులోకి వస్తూ.. పోతూ ఉన్న భువీ.. వన్డే జట్టులో మాత్రం పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.