రాజ్ తరుణ్ హీరోగా పరిచయమైన 'ఉయ్యాలా జంపాలా' సినిమా నిర్మాణ సంస్థల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. ఇప్పుడీ 'అనుభవించు రాజా' నిర్మాణ సంస్థల్లోనూ అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. 'ఉయ్యాలా జంపాలా'ను నాగార్జున నిర్మిస్తే... ఇప్పుడీ సినిమాను ఆయన మేనకోడలు సుప్రియ నిర్మించారు. రెండూ పల్లెటూరి నేపథ్యంలో సినిమాలే. 'అనుభవించు రాజా'లో ఊరిలో రాజలాంటి కుర్రాడు సిటీకి వచ్చి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడనే పాయింట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. 'ఉయ్యాలా జంపాలా' హిట్టు. మరి, 'అనుభవించు రాజా'? సినిమా ఎలా ఉంది?


కథ: రాజా అలియాస్ బంగారం అలియాస్ బంగార్రాజు (రాజ్ తరుణ్) ఫ్యామిలీ అంతా గుడికి వెళ్లి వస్తుండగా... ఓ కార్ యాక్సిడెంట్‌ జరుగుతుంది. బంగారం తప్ప మిగతా కుటుంబ సభ్యులు అందరూ ప్రాణాలు కోల్పోతారు. మరణించే ముందు తన జీవితం అంతా సంపాదించడానికి సరిపోయిందని... మనవడితో అనుభవించమని తాతయ్య చెబుతారు. కోట్ల రూపాయల ఆస్థి కుర్రాడి చేతిలోకి రావడంతో అనుభవించడం మొదలు పెడతారు. అటువంటి బంగార్రాజు ఊరి వదిలి హైదరాబాద్ వచ్చి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరతాడు. ఎందుకు? సిటీలో శృతి (కశిష్ ఖాన్)తో అతడి ప్రేమ కథ ఏమిటి? సుపారీ తీసుకుని హత్యలు చేసే ఓ ముఠా ('టెంపర్' వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ గ్యాంగ్) బంగారాన్ని చంపాలని అతడి వెనుక ఎందుకు పడుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే... సినిమా చూడాలి. 


విశ్లేషణ: పల్లెటూరిలో తాతల నుంచి వచ్చిన ఆస్తితో ఎంజాయ్ చేసే జల్సా రాయుళ్లు, అటువంటి వాళ్లను చూసి ఈర్ష్య పడే మనుషులు, వారసత్వం కోసం తగాదాలు వంటివి సహజం. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. మళ్లీ మరో సినిమా కంటే కథలో ఏదో కొత్తదనం ఉంటేనే.... ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ కథలో అటువంటి కొత్తదనం లేదు. పోనీ కథనం ఆసక్తికరంగా సాగిందా? అంటే అదీ లేదు. దర్శకుడు శ్రీను గవిరెడ్డి నిదానంగా, నెమ్మదిగా సినిమాను నడిపారు. అందువల్ల, సినిమాలో బోరింగ్ మూమెంట్స్ మధ్య మధ్యలో వచ్చి వెళుతూ ఉంటాయి. అయితే... అక్కడక్కడా కొన్ని మంచి మాటలు రాశారు. ముఖ్యంగా క్లైమాక్స్ డైలాగ్స్ బావున్నాయి. రాజ్ తరుణ్, సుదర్శన్ టైమింగ్ వల్ల కొన్ని సీన్స్ నవ్వించాయి. హీరో సెక్యూరిటీ గార్డ్ అని హీరోయిన్‌కు తెలిసిన తర్వాత వచ్చే సీన్ కూడా పర్లేదు. అయితే, ఆ తర్వాత మరింత నవ్విస్తారని అనుకుంటే... కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్లింది. ఆ డ్రామా, అదీ పండలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సోసోగా ఉంది. పల్లెటూరికి వెళ్లిన తర్వాత మరింత రొటీన్ అయ్యింది. అక్కడి ట్విస్ట్ కూడా ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అందువల్ల, సినిమా సోసోగా అనిపిస్తుంది. పాటల్లో 'అనుభవించు రాజా' బావుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి.
గోదావరి యాస మాట్లాడటంలో, గోదారి కుర్రాడిగా కనిపించడంలో రాజ్ తరుణ్ పర్ఫెక్ట్. ఈ సినిమాలోనూ అతడు గోదారి కుర్రాడిగా బాగా చేశారు. సెక్యూరిటీ గార్డుగా డిఫరెంట్ గెట‌ప్‌లో కనిపించారు. రెండు షేడ్స్‌లోనూ తన పాత్ర పరిధి మేరకు నవ్వించారు. హీరోయిన్‌గా పరిచయమైన కశిష్ ఖాన్ నటన పర్వాలేదు. మోడ్రన్ సాఫ్ట్‌వేర్ అమ్మాయిగా చూపులకు బావుంది. ప్రెసిడెంట్ పాత్రలో ఆడుకాలమ్ నరేన్ హుందాగా ఉన్నారు. అజయ్, భూపాల్, రవికృష్ణ, పోసాని కృష్ణమురళీ పాత్రల పరిధి మేరకు నటించారు. 'టెంపర్' వంశీకి మరోసారి మంచి పాత్ర లభించింది. డైలాగ్స్ తక్కువ అయినా... నటనలో విలనిజం చూపించారు. హీరో స్నేహితులుగా ఫ‌స్టాఫ్‌లో సుదర్శన్, సెకండాఫ్‌లో యూట్యూబర్ చందు కనిపించారు. ఉన్నంతలో తమ పాత్ర పరిధి మేరకు నటించారు. రొటీన్ పల్లెటూరి సీన్స్, స్టోరీతో సాగిన ఈ సినిమాలో కొన్ని నవ్వులు, మాటలతో పాటు చివర్లో అందించిన సందేశం బావుందంతే!   

Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!


Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం


Also Read: ‘లైగర్’ స్టార్ మైక్ టైసన్‌కు గంజాయిని ప్రోత్సహించే బాధ్యతలు.. ప్రభుత్వం విజ్ఞప్తి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి