రివ్యూ: దృశ్యం 2
రేటింగ్: 3/5
ప్రధాన తారాగణం: వెంకటేష్, మీనా, కృతికా జయకుమార్, ఎస్తర్ అనిల్, నదియా, వీకే నరేష్, సంపత్ రాజ్, 'సత్యం' రాజేష్, సుజ వరునీ, పూర్ణ, తనికెళ్ల భరణి తదితరులు
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
కెమెరా: సతీష్ కురుప్
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: డి. సురేష్ బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి
రచన, దర్శకత్వం: జీతూ జోసెఫ్
విడుదల తేదీ: 25-11-2021
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
కరోనా కారణంగా కొన్ని సినిమాలు ఓటీటీకి వచ్చాయి. ఆ చిత్రాల్లో మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం 'దృశ్యం 2' కూడా ఒకటి. గతంలో ఆయన నటించిన 'దృశ్యం'కు సీక్వెల్ అది. తెలుగులో 'దృశ్యం' సినిమాను వెంకటేష్ అదే పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు 'దృశ్యం 2'ను రీమేక్ చేశారు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏంటంటే... మోహన్ లాల్ 'దృశ్యం' థియేటర్లలో విడుదలైంది. ఆ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు తక్కువ. 'దృశ్యం 2' డిజిటల్ తెరపై విడుదలైంది. ఓటీటీలో వీక్షించిన సినీ అభిమానులు కొంతమంది ఉన్నారు. వాళ్లకు సినిమా ఎలా అనిపిస్తుంది? చూడని వాళ్లకు ఎలా ఉంటుంది?
('దృశ్యం' ఎక్కడ ముగిసిందో... అక్కడ నుంచి 'దృశ్యం 2' మొదలవుతుంది)
కథ: రాంబాబు (వెంకటేష్) కేబుల్ ఆపరేటర్ స్థాయి నుంచి థియేటర్ యజమానిగా ఎదుగుతాడు. ఓ సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తుంటాడు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సీనియర్ రచయిత వినయ్ చంద్ర (తనికెళ్ల భరణి)కు ఓ కథ చెప్పి, స్క్రిప్ట్ రూపంలో మార్చమని కోరతాడు. ఓ వైపు ఈ జీవితం సాగుతూ ఉంటుంది. మరోవైపు అతడి కుటుంబాన్ని గతం వెంటాడుతూ ఉంటుంది. రాంబాబు భార్య జ్యోతి (మీనా), పెద్దమ్మాయి అంజు (కృతికా జయకుమార్) పోలీసులను చూస్తే భయపడుతూ ఉంటారు. ఊరి జనాల్లో వరుణ్ కేసు గురించి డిస్కషన్లకు అంతులేదు. గీత (నదియా) స్నేహితుడైన ఐజీ గౌతమ్ సాహు (సంపత్ రాజ్) ఇద్దరు పోలీసులను అండర్ కవర్‌లో ఉంచి కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత కేసును రీ-ఓపెన్ చేయిస్తాడు. పోలీస్ స్టేషన్‌లోనే రాంబాబు వరుణ్ బాడీని పాతిపెట్టాడని ఒకరు చెబుతారు. తవ్వితే బాడీ ఉంటుంది. దాంతో రాంబాబును అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్‌లో దొరికిన బాడీ వరుణ్‌దేనా? ఈ కేసు నుంచి రాంబాబు ఎలా భయపడ్డాడు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: రీమేక్ సినిమాలను కొందరు ఒరిజినల్‌తో కంపేర్ చేస్తారు. ఒరిజినల్‌లో ఉన్నది ఉన్నట్టుగా తీస్తే... కాపీ పేస్ట్ చేస్తారని చేశారని కామెంట్స్ చేస్తారు. అయితే... సోల్ మిస్ అవ్వకుండా సినిమా తీసి మెప్పించడం అంత సులభం కాదు. 'దృశ్యం 2'కు వచ్చేసరికి... ఒరిజినల్ విడుదలైన ఓటీటీ వేదికలో రీమేక్ కూడా విడుదల కావడం వల్ల, ఒరిజినల్ చూసిన వాళ్లకు అదే కథను కొత్త నటీనటులతో చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అది పక్కన పెడితే... ఒరిజినల్ చూడని వాళ్లకు ఇదొక కొత్త సినిమా. వెంకటేష్ నటించిన సినిమాను చూస్తున్నట్టు ఉంటుంది.
సినిమా ప్రారంభమైన గంట వరకూ సాధారణంగా ఉంటుంది. కథలో పెద్దగా మలుపులు, ఉత్కంఠకు గురి చేసే అంశాలు ఏవీ ఉండవు. కొత్త క్యారెక్టర్లు కొన్ని యాడ్ అవుతాయి. ఆ క్యారెక్టర్లు ఎందుకు వచ్చాయనేది ఆ తర్వాత చూపిస్తారు. దాంతో అక్కడి వరకూ సినిమా కొంచెం నిదానంగా ఉంటుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, అంతకు ముందు ట్విస్టులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఓ షాక్ ఇస్తుంది (ఒరిజినల్ చూడని వాళ్లకు). మలయాళ 'దృశ్యం 2' తీసిన దర్శకుడు జీతూ జోసెఫ్, ఆ చిత్రానికి పని చేసిన సినిమాటోగ్రాఫర్ సతీష్ కురుప్... తెలుగు 'దృశ్యం 2'కు మళ్లీ పని చేశారు. ఇద్దరూ సేమ్ మేజిక్ రిపీట్ చేశారు. సినిమాటోగ్రఫీ బావుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. నిర్మాణ విలువలు బావున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం కథతో పాటు సాగింది. కథలో ఫీల్ ఎలివేట్ చేసింది.
వెంకటేష్ మరోసారి రాంబాబు పాత్రలో ఒదిగిపోయారు. తనదైన శైలిలో నటించారు. పోలీస్ స్టేషన్‌లో బాడీ దొరికిందని తెలిసిన తర్వాత మీనాతో 'భయపడకు... మీ ముగ్గురికీ ఏమీ కానివ్వను' అని చెప్పే సన్నివేశంలో ఆయన నటన సహజంగా ఉంటుంది. అదే సమయంలో సినిమా చూసేవాళ్లను కథలోకి మరింత తీసుకువెళుతుంది. మీనా, కృతిక, ఎస్తర్ అనిల్, నదియా, వీకే నరేష్... 'దృశ్యం'లో ప్రధాన తారాగణమంతా ఇందులోనూ ఉన్నారు. మరోసారి తమ నటనతో ఆకట్టుకున్నారు. 'దృశ్యం 2'లో కొత్తగా వచ్చిన పాత్రల్లో ఐజీగా సంపత్ రాజ్, రచయితగా తనికెళ్ల భరణి ఆకట్టుకుంటారు. 'దృశ్యం'లో ఉత్కంఠతో పోలిస్తే, 'దృశ్యం 2'లో ఉత్కంఠ కొంచెం తక్కువైనా... క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిందని చెప్పాల్సిందే. అలాగే, వెంకటేష్ నటన కూడా! ఒరిజినల్ చూడని వాళ్లకు మంచి క్లైమాక్స్, సినిమా చూసిన అనుభూతి ఇస్తుంది.