సింహళీయులు గర్జించారు..! బంగ్లా పులులను బెంబేలెత్తించారు. చరిత అసలంక  (80*: 49 బంతుల్లో 5x4, 5x6) , భనుక రాజపక్స  (53: 31 బంతుల్లో 3x4, 3x6)  ఎడాపెడా షాట్లు బాదేయడంతో బంగ్లా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. కష్టతరమైన పిచ్‌పై వీరిద్దరి సూపర్‌ బ్యాటింగ్‌తో లంక 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. అంతకు ముందు బంగ్లాలో ఓపెనర్‌ మహ్మద్‌ నయీమ్‌ (62: 52 బంతుల్లో 6x4), నమ్ముకోదగ్గ ఆటగాడు ముష్ఫికర్‌ రహీమ్‌ (57*: 37 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకాలు చేశారు.


అస'లంక' అదుర్స్‌






పిచ్‌.. స్కోరును చూస్తే లంకేయులు ఈ భారీ స్కోరును ఛేదించడం కష్టమే అనిపించింది. 2 పరుగుల వద్దే ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా (1)ను నసుమ్‌ అహ్మద్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మొదటే వికెట్‌ చేజార్చుకున్నా లంక దూకుడుగానే ఆడింది. మరో ఓపెనర్‌ పాథుమ్‌ నిసాంక (24)తో కలిసి చరిత అసలంక రెచ్చిపోయాడు. చక్కని బౌండరీలు బాదుతూ రెండో వికెట్‌కు 69 (45 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం అందించాడు.


జట్టు స్కోరు 71 వద్ద నిసాంక, అవిష్క ఫెర్నాండో (0)ను పెవిలియన్‌ పంపించి షకిబ్‌ బ్రేక్‌ ఇచ్చాడు. మరికాసేపటికే హసరంగ (6)ను సైఫుద్దీన్‌ ఔట్‌ చేయడంతో స్కోరు వేగం తగ్గింది. అయితే క్రీజులోకి భనుక రాజపక్స రావడంతో కథ మారిపోయింది. తమ ఎడమచేతి వాటంతో వీరిద్దరూ సూపర్‌ సిక్సర్లు కొట్టేశారు. 52 బంతుల్లోనే 86 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అసలంక 32, రాజపక్స 28 బంతుల్లోనే అర్ధశతకాలు చేశారు. ఆఖర్లో రాజపక్స ఔటైనా మరో 7 బంతులుండగానే అసలంక గెలిపించేశాడు.


ముషి, నయీమ్‌ అర్ధశతకాలు


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు నయీమ్‌, లిటన్‌ దాస్‌ (16) 40 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం అందించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని 5.5వ బంతికి లిటన్‌ను ఔట్‌ చేయడం ద్వారా లాహిరు కుమార విడదీశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షకిబ్‌ అల్‌ హసన్‌ (10)ను కరుణరత్నె క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో బంగ్లా 56కే రెండు వికెట్లు కోల్పోయింది.


అప్పుడే వచ్చిన ముష్ఫికర్‌తో నయీమ్‌ సూపర్ భాగస్వామ్యం నెలకొల్పాడు. చక్కని బౌండరీలు బాదుతూ ఈ జోడీ 51 బంతుల్లోనే 73 పరుగులు చేసింది. దాంతో వికెట్లు తీసేందుకు లంక కష్టపడింది. అర్ధశతకం చేసిన నయీమ్‌ను 16.1వ బంతికి కాట్‌ అండ్‌ బౌల్‌తో ఫెర్నాండో పెవిలియన్‌ పంపించాడు. అప్పటికి బంగ్లా స్కోరు 129. దాంతో అఫిఫ్‌ హుస్సేన్‌ (7), మహ్మదుల్లా (10*) అండతో ముష్ఫికర్‌ 32 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. ప్రత్యర్థికి మంచి లక్ష్యం నిర్దేశించాడు.


Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!


Also watch: T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?


Also Read: Virat Kohli Pressmeet: మంటలో పెట్రోల్ పోయను.. మాట్లాడటానికేమీ లేదు.. ప్రెస్‌మీట్‌లో కోహ్లీ ఏమన్నాడంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి