టీ20 వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 130 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు  వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 10.2 ఓవర్లలో 62 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో సూపర్ 12 గ్రూప్ 2లో ఆఫ్ఘనిస్తాన్ అగ్రస్థానానికి చేరుకుంది. ఇదే గ్రూపులో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఐదు వికెట్లు తీసిన ముజీబ్ ఉర్ రహమాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


భారీ స్కోరు చేసిన ఆఫ్ఘన్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు మహ్మద్ షెజాద్ (22: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), హజ్రతుల్లా జజాయ్(44: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగి ఆడటంతో పవర్ ప్లే ముగిసేరికి ఆఫ్ఘనిస్తాన్ 55 పరుగులు చేసింది. పవర్‌ప్లే ఆఖరి ఓవర్‌లో షెజాద్ అవుటయ్యాడు.


ఆ తర్వాత గుర్బాజ్ (46: 37 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు), నజీబుల్లా (59: 34 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) కూడా చెలరేగి ఆడటంతో 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్‌యాన్ షరీఫ్ రెండు వికెట్లు తీయగా.. డేవీ, మార్క్ వాట్ చెరో వికెట్ తీశారు.


కుప్పకూల్చిన ముజీబ్ూ
191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ ఇన్నింగ్స్ మూడు ఓవర్ల వరకు సాఫీగానే సాగింది. ముజీబ్ ఉర్ రహమాన్ బౌలింగ్‌కు రాగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తన మొదటి ఓవర్లోనే ముజీబ్ ఏకంగా మూడు వికెట్లు తీశాడు. దీంతో స్కాట్లాండ్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్లోనే నవీన్ ఉల్ హక్ మరో వికెట్ తీశాడు. ఆరో ఓవర్లో ముజీబ్ మరో వికెట్ తీసి స్కాట్లాండ్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.


ఆ తర్వాత రషీద్ బౌలింగ్‌కు రావడంతో స్కాట్లాండ్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. రషీద్ కూడా నాలుగు వికెట్లు తీయడంతో స్కాట్లాండ్ 10.2 ఓవర్లలో 62 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్ ఐదు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ నాలుగు, నవీన్ ఉల్ హక్ ఒక వికెట్ తీశాడు.


Also Read: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?


Also Read: పాక్‌ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!


Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?


Also Read: IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి