Pakistan cricket failure reasons: క్రికెట్‌ ప్రపంచంలో ఇప్పుడు పాకిస్థాన్‌(Pakistan) పతనంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఏ టీం అయినా సొంత గడ్డపై అడుతుందంటే అవతలి జట్టుకు కొద్దిగా భయమే. ప్రతి దేశానికి సొంత మైదానాల్లో ఆడడం అదనపు బలం. భారత్‌(India)లో టీమిండియాను.. ఆస్ట్రేలియా(AUS)లో కంగారులను ఎదుర్కోవడం ఎంత కష్టమో.. ఏ జట్టును అయినా వారి దేశంలో ఆడడం కూడా అంతే కష్టం. గ్రౌండ్ పరిస్థితులు, అభిమానుల మద్దతు ఇలా చాలా విషయాల్లో సొంత జట్టుకు అడ్వాంటేజ్‌ ఉంటుంది. అలాగే సొంత అభిమానుల మధ్య, తమకు అనుకూలంగా ఉంటే పిచ్‌పై బాగా ఆడే అవకాశం  ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా జట్లు స్వదేశంలో వీర విహరం చేస్తూ, విదేశీ గడ్డలపై జరిగే మ్యాచుల్లో చేతులెత్తుస్తుంటాయి. ఇప్పుడు పాకిస్థాన్‌ మాత్రం విదేశాల్లోనే కాకుండా సొంత మైదానంలో విఫలం కావడం చర్చకు దారి తీసింది. అటు ఆస్ట్రేలియా గడ్డపైనా ఘోరంగా ఓడిపోయిన పాక్‌... ఇప్పుడు సొంత మైదానంలో పాక్‌ చేతులోనూ పరాజయం పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

 

టాలెంట్‌ అవసరం లేదట

బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమి పాలైన పాకిస్థాన్‌ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్‌.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందే స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ లు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. 2022-23లో ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల్లోనూ ఓడిపోయింది. వరుస సిరీస్‌ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. హోమ్ గ్రౌండ్లో  పాకిస్థాన్‌ ఇంత చెత్త ప్రదర్శన చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.  పాక్‌ జట్టులో భజన బ్యాచ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. ఫాంతో పని లేకుండా కెప్టెన్‌, సెలెక్టర్లు, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌కు క్లోజ్‌గా ఉన్న ఆటగాళ్లకే  జాతీయ జట్టు లో చోటు దక్కుతుందన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. దేశవాళి క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నా చాలామంది ఆటగాళ్లకు టీమ్‌లో అవకాశం లభించదు. ఈ పరిస్థితి పోవాలని మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు ఎవరు చెప్పినా పాక్‌ బోర్డు అస్సలు పట్టించుకోదు. 

 


 

డ్రెస్సింగ్ రూం గొడవలు

ఒకప్పుడు పాకిస్థాన్‌ జట్టు ఎంతో స్ట్రాంగ్‌గా ఉండేది. టెయిలెండర్ల వరకు బాగా ఆడే వారు ఉండేవారు. బౌలర్లు రివర్స్ స్వింగ్, దూస్రాలు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టేవారు. ఇండియాతో మ్యాచ్ అంటే   ఢీ అంటే ఢీ అనేలా ఆడేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. కొత్తగా క్రికెట్ ఆడే జట్లు కూడా పాక్‌ను ఓడించేలా మారింది. ఆ జట్టు పరిస్థితి. టీ 20 వరల్డ్ కప్‌లో అమెరికా మీద పాక్‌ జట్టు ఓడిపోయిన విషయాన్ని చాలామంది గుర్తు చేస్తున్నారు.  చాలా కాలంగా పాకిస్థాన్‌ జట్టు ఒకరిద్దరు ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. బాబర్‌ ఆజమ్‌, మొహ్మమద్‌ రిజ్వాన్‌, షాహీన్‌ షా అఫ్రిదీలను పాక్‌ జట్టు ఎక్కువగా నమ్ముకుంది. అలాగే ఆటగాళ్ల మధ్య విభేదాలు. టీమ్‌లో ఆటగాళ్ల మధ్య సరైన సాన్నిహిత్యం లేకపోవడం... బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ షా అఫ్రిదీ, టెస్ట్‌ కెప్టెన్‌ షాన్‌ మసూద్‌లకు ఒకరంటే ఒకరు పడదనే ఆరోపణలు కూడా పాక్ జట్టను పతనం దిశగా నడిపిస్తున్నాయి.

 


 

ఆ గొడవల వల్లే...

బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ ఓడిపోవడంతో ఏ విధంగా డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లు గొడవపడింది చూశాం. పాకిస్థాన్‌ క్రికెట్‌లో రాజకీయ జోక్యం చాలా ఎక్కువ. క్రికెట్ బోర్డులు స్వతంత్రంగా వ్యవహరించాలని  ఐసీసీ చెబుతోంది. కానీ, పాకిస్థాన్‌ క్రికెట్‌లో అనధికారికంగా పాలిటిక్స్ ప్రభావం చాలానే ఉంది. అక్కడి ప్రభుత్వాలు, బడా రాజకీయ నేతలు చెప్పిన వారే పీసీబీ ఛైర్మన్‌, సెలెక్షన్‌ కమిటీ మెంబర్‌, కెప్టెన్‌ అవుతారు. వారు చెప్పిందే వేదం. నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాట తయారయ్యింది పీసీబీ తీరు. ఎప్పుడైతే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. బాబర్‌ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడో అప్పటి నుంచి పాక్‌ క్రికెట్‌ పూర్తిగా గాడి తప్పింది. ఇలా చెబుతూ పోతే  పాక్ టీం పేలవ ప్రదర్శనకు అనేక కారణాలు ఉన్నాయి.