Pakistan cricket team Down fall : అరివీర భయంకర బౌలర్లు.... కళాత్మకమైన షాట్లతో అలరించే బ్యాటర్లు.. మైదానంలో చిరుతల్లా కదిలే ఫిల్టర్లు.. ఇది ఒకప్పటి పాకిస్థాన్ జట్టు(Pakistan Cricket team). పేసర్లు అంటే పాక్.... పాక్ అంటే పేసర్లు అనేలా ఉండేది దాయాది జట్టు. రివర్స్ స్వింగ్ తో పేస్ బౌలింగ్ అటాక్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పేట్టే బౌలర్లకు కేరాఫ్ అడ్రస్ గా పాక్ టీమ్ ఉండేది. సయీద్ అన్వర్, ఇంజమామ్, మహ్మద్ యూసఫ్, మియందాద్, షాహీద్ అఫ్రిదీ.. షోయబ్ మాలిక్ ఇలా అద్భుత బ్యాటర్ల లిస్ట్ పెద్దగానే ఉంది. ఇక బౌలర్లయితే తిరుగే లేదు. ఏ బంతితో అయినా రివర్స్ స్వింగ్ రాబట్టగలిగే బౌలర్లు పాక్‌లో ఉండేవారు. వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, షోయబ్ అక్తర్ బౌలింగ్‌ను మర్చిపోవడం క్రికెట్ అభిమానికి అంత తేలిక కాదు. ఒకప్పుడు పాక్‌తో మ్యాచ్ అంటే... జట్టు ఏదైనా భయపడేవంటే అతిశయోక్తి ఏం లేదు. ఇక స్వదేశంలో అయితే పాక్ దూకుడు ముందు మిగిలిన జట్లన్నీ తేలిపోయేవి. ఏక పక్ష విజయాలతో క్రికెట్ ప్రపంచాన్ని ఓ దశలో ఉర్రూతలూగించిన పాక్... ఇప్పుడు పతనం దిశగా పయనిస్తోంది.
మరో విండీస్ అవుతుందా..?
ఓ వైపు భారత జట్టు(Team India) నానాటికి క్రికెట్ ప్రపంచాన్ని ఏలే దిశగా ముందుకు సాగుతుంటే మరోవైపు పాకిస్థాన్ మాత్రం పతాళానికి పడిపోతోంది. ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం.. సెలక్షన్ కమిటీలో రాజకీయాలు... మితిమీరిన ఆత్మ విశ్వాసం పాక్‌ను పూర్తిగా అథ:పాతాళం వైపుగా తీసుకెళ్తోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో అయితే పాక్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో కొట్టుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. అంతేనా పాక్ హెడ్ కోచ్ గిలస్పీతో పాక్ టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్‌తో ఏదో విషయంపై తీవ్రంగా గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్‌కు.. పాక్ టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్‌కు మధ్య అసలు పొసగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
మార్పులే మార్పులు.. అయినా
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఘోర పరాభవం తర్వాత పాక్ జట్టులో భారీ మార్పులు జరిగాయి. కెప్టెన్ బాబర్ అజమ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి మూడు ఫార్మట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది. అయినా పాక్ ఓటమి కష్టాలు తప్పలేదు. ఆస్ట్రేలియా టూర్‌లో.. ఇంగ్లండ్ మ్యాచుల్లో.. టీ 20 ప్రపంచకప్‌లో పాక్ కనీసం పోటీ ఇవ్వకుండా పరాజయం పాలైంది. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ టెస్ట్ సిరీస్‌లో అయితే పాక్ ఆటతీరు పసికూన కంటే దారుణంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్‌ను మెచ్చుకోవాల్సిందే అయితే... అసలు పోటీ కూడా ఇవ్వలేని పాక్‌ను ఏమనాలో ఆ దేశ మాజీ క్రికెటర్లకు.. అభిమానులకు కూడా అర్థం కావడం లేదు.