Bangladesh Won By 6 Wikects Against Pakistan In Second Test: బంగ్లాదేశ్(Bangladesh) చరిత్ర సృష్టించింది. అది అలాంటి ఇలాంటి చరిత్ర కాదు. భవిష్యత్తు తరం గర్వంతో చెప్పుకునేలా... తమ ఘనతను సువర్ణాక్షరాలతో లిఖించేలా యువ క్రికెటర్లకు స్ఫూర్తి నింపేలా చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌(Pakistan) గడ్డపైనే పాక్‌ను మట్టికరిపించి.. క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి.. ఆశ్చర్యానికి గురి చేసింది. తమపై ఉన్న పసికూన ముద్రను పాక్‌కు అప్పగిస్తూ... తామిక అగ్ర జట్టని... తమతో అంత ఈజీ కాదని ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలే పంపింది.  పాక్‌ను వారి దేశంలోనే 2-0తో క్లీన్ స్వీప్ చేసి..ఔరా అనిపించింది.  పాకిస్థాన్‌ను వారి దేశంలోనే క్లీన్ స్వీప్ చేసిన తొలి ఆసియా జట్టుగాను రికార్డు నెలకొల్పింది.


Read Also: Paris Paralympics 2024: పతక పంట అంటే ఇది, బ్యాడ్మింటన్ లో కొత్త చరిత్ర


పాపం పాక్‌...

పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. అన్ని రంగాల్లో సమర్థంగా రాణించిన బంగ్లా... సాధికార విజయాలతో పాక్‌కు ఘోర పరాభావాన్ని మిగిల్చింది. ఈ ఘోర ఓటమితో పాక్ ఆటగాళ్లు అవమాన భారంతో కుంగిపోతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పాకిస్థాన్‌లో పాక్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. వరుసగా బంగ్లా రెండు టెస్ట్ మ్యాచులు గెలిచింది. పాక్ ఈ ఓటమిని అంత తేలిగ్గా మర్చిపోలేదన్నది కాదనలేని వాస్తవం. 2009లో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లా క్లీన్ స్వీప్‌ చేసింది. ఆ తర్వాత 2021లో జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్‌ను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు పాక్‌తో జరిగిన రెండు టెస్టులను గెలిచి 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 





 

పోరాడలేదు.. ఫలితం దక్కలేదు

ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. రెండో  టెస్ట్‌లో బలంగా పుంజుకోవాలన్న పాక్‌కు... బంగ్లా దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. రెండో టెస్ట్‌లో పాక్‌ నిర్దేశించిన  185 పరుగుల లక్ష్యాన్ని తేలిగ్గా ఛేదించేసి క్లీన్ స్వీప్ చేసింది. ఓవర్‌ నైట్ స్కోరు 42 పరుగులతో లక్ష్య ఛేదన ఆరంభించిన బంగ్లా... కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి సునాయసంగా విజయం సాధించింది. పాకిస్థాన్ ఈ సిరీస్‌లో అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.  పాక్‌ జట్టును ఈ సిరీస్‌ అంతా బ్యాటింగ్, బౌలింగ్‌ సమస్యలు వేధించాయి. 2022లో ఇంగ్లండ్‌ చేతిలోనూ పాకిస్థాన్‌ వైట్ వాష్ అయింది. ఓ పక్క దేశంలో అల్లర్లు, ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా బంగ్లా స్ఫూర్తి దాయక ఆటతీరుతో ఆకట్టుకుంది. ఇక ఈ విజయంతో బంగ్లా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోగా... పాక్‌ ఆటగాళ్లు అవమాన భారంతో మైదానాన్ని వీడారు.