Rahul Dravid as Head Coach Of Rajasthan Royals ? : టీమిండియా మాజీ ఆటగాడు, భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన హెడ్‌ కోచ్‌.. రాహుల్ ద్రవిడ్‌(Rahul Dravid రాజస్థాన్‌ రాయల్స్‌(Rajasthan Royals) ప్రధాన కోచ్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నాడు.  ఈ ఏడాది భారత్‌కు టీ 20 ప్రపంచకప్‌ అందించిన ద్రవిడ్‌.. ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం రాజస్థాన్‌ జట్టుతో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కోచ్‌గా ద్రవిడ్‌కు ఐపీఎల్‌ జట్లలో మంచి డిమాండ్‌ ఉంది. అయితే రాహుల్ ద్రవిడ్‌ కోచ్‌గా కొనసాగుతారా.. లేక... విశ్రాంతి తీసుకుంటారా అనే దానిపై విస్తృతంగా చర్చలు జరిగాయి. అయితే ద్రవిడ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని రాజస్థాన్ రాయల్స్‌ వర్గాలు వెల్లడించాయి.

 





కీలక పాత్ర ఖాయం...

ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి రంగం సిద్ధమవుతోంది. స్టార్‌ ఆటగాళ్లు అదే జట్టులో కొనసాగుతారా.. లేక కొత్త జట్టుకు వెళ్తారా అనేదానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్‌ ద్రవిడ్‌... రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు హెడ్ కోచ్‌గా వెళ్తే అది ఆ జట్టు కూర్పుపై సానుకూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ ద్రవిడ్ 2025 IPL సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్  ప్రధాన కోచ్‌గా తిరిగి రాబోతున్నాడని స్పష్టంగా తెలుస్తుండడంతో మెగా వేలంలో ఏయే ఆటగాళ్లపై రాజస్థాన్‌ ప్రాంచైజీ దృష్టి పెట్టనుందనే దానిపై ఇప్పటినుంచే చర్చలు జరుగుతున్నాయి. ద్రవిడ్ ఇటీవలే ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని... రాబోయే మెగా వేలానికి ముందు ప్లేయర్ రిటెన్షన్‌లపై కూడా ద్రవిడ్‌ రాజస్థాన్‌ యాజమాన్యంతో చర్చలు జరిపాడని తెలుస్తోంది. ద్రవిడ్ శిక్షణలో అండర్-19లో వెలుగులోకి వచ్చిన  సంజు శాంసన్‌..... ఇప్పుడు రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ద్రవిడ్‌- శాంసన్‌ మధ్య గురు శిష్యుల సంబంధం ఉండడం కూడా రాజస్థాన్‌ జట్టుకు కలిసిరానుంది. 

 


 

గతంలోనూ...

రాహుల్‌ ద్రవిడ్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌తో సత్సబంధాలు ఉన్నాయి. IPL 2012, 2013 సీజన్‌లో ద్రవిడ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2014, 2015 సీజన్‌లలో రాజస్థాన్‌ డైరెక్టర్‌గా, మెంటార్‌గా పనిచేశాడు. 2016, 2019లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టేంత వరకు ద్రవిడ్‌... రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుతోనే ఉన్నాడు. 2021లో భారత పురుషుల జట్టుకు ప్రధాన కోచ్‌గా తర్వాత ద్రవిడ్‌ బాధ్యతలు స్వీకరించాడు. మూడేళ్ల పాటు భారత ప్రధాన హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ద్రవిడ్‌... ఇటీవల భారత్‌కు టీ 20 ప్రపంచకప్‌ కూడా అందించాడు. 

 


 

అసిస్టెంట్‌గా విక్రమ్‌

ద్రవిడ్ అసిస్టెంట్ కోచ్‌లలో ఒకరిగా భారత జట్టు మాజీ బ్యాటర్ విక్రమ్ రాథోడ్‌ కూడా రాజస్థాన్‌ జట్టులో భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. మాజీ సెలెక్టర్ అయిన రాథోడ్‌... 2019 నుంచి భారత బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. NCAలోనూ ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్‌లో ఒకరిగా విక్రమ్‌ ఉన్నాడు. రాజస్థాన్‌ ఇప్పటివరకూ టైటిల్‌ గెలవలేదు. 2022లో రన్నరప్‌గా నిలవడం మాత్రమే రాజస్థాన్‌ అత్యుత్తమ ప్రదర్శన. 2023లో ఆర్‌ ఆర్‌ ప్లేఆఫ్‌ కూడా చేరలేదు. గత సీజన్‌లో రాజస్థాన్‌ ఐదో స్థానంలో నిలిచింది. 2024లో క్వాలిఫైయర్ 2లో ఓడిపోయింది.