India records its best ever medal haul at a single edition: పారిస్ పారాలింపిక్స్‌(Paris Paralympics 2024)లో భారత(India) పతకాల పంట పండిస్తోంది. టార్గెట్‌ 25 దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, 10 కాంస్యాలతో భారత్ పతాకాల సంఖ్య 20కి చేరింది. గతంలో ఎన్నడూ లేని విభాగాల్లోనూ భారత్‌ పతకాలు సాధించి ఈసారి అద్భుతం చేసింది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగంలో భారత్‌ పతకాలతో సత్తా చాటింది. పారాలింపిక్స్‌ ఆరో రోజు... టోక్యో పారాలింపిక్స్‌( Tokyo Paralympics2024)లో సాధించిన పతకాల సంఖ్యను భారత్ దాటేసింది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ 19 పతకాలు సాధించగా.. పారిస్‌లో ఇప్పటికే పతకాల సంఖ్య 20కి చేరింది. ఈ పారాలింపిక్స్‌లో 25 పతకాలు సాధించాలని భారత్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారత ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది. పతకాల జాబితాలో చైనా 112 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా... బ్రిటన్‌ 59, అమెరికా 53 పతకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ 20 పతకాలతో పతకాల జాబితాలో 17వ స్థానంలో ఉంది.


Read Also: Paris Paralympics 2024: తెలుగు పతక దీప్తి, అలుపెరగని పరుగుకు దక్కిన కాంస్య కీర్తి


అదరగొట్టారు...


పురుషుల జావెలిన్ త్రోలో అర్జీత్‌ సింగ్‌, గుర్జర్‌ సుందర్‌ సింగ్‌ పతకాలతో మెరిశారు. జావెలిన్‌ త్రో ఎఫ్‌46 విభాగంలో అర్జీత్‌ సింగ్‌ రజతం గెలవగా.. ఇదే విభాగంలో గర్జర్‌ సుందర్‌ సింగ్‌ కాంస్యంతో మెరిశాడు. అర్జీత్‌ ఈటెను 65.62 మీటర్ల దూరం విసిరి రజతం కైవసం చేసుకున్నాడు. ఆర్జీత్‌ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. సుందర్ సింగ్‌ సీజన్-బెస్ట్ త్రో 64.96 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి కాంస్యం సాధించాడు. క్యూబాకు చెందిన జావెలిన్ త్రోయర్‌ గిల్లెర్మో 66.14 మీటర్లు విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ విజయాలతో భారత్‌కు ఒకే విభాగంలో మరోసారి రెండు పతకాలు దక్కాయి. ఇక పురుషుల హైజంప్ T6 ఫైనల్‌లో పారా-అథ్లెట్లు శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. శరద్ కుమార్ 1.88 మీటర్లు దూకి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరియప్పన్ తంగవేలు 1.85 మీటర్ల ఎత్తుతో కాంస్యం సాధించాడు. అమెరికాకు చెందిన ఎజ్రా ఫ్రెచ్ 1.94 మీటర్ల ఎత్తు దూకి పారాలింపిక్ రికార్డు సృష్టించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.


Read Also : Vinesh Phogat: వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా పొలిటికల్ ఎంట్రీ - ఈ ఒక్క ఫొటోతో కన్‌ఫమ్ అయినట్టేనా?


బ్యాడ్మింటన్‌లో మరోటి


బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌6 విభాగంలో పారా అథ్లెట్‌ నిత్యశ్రీ సివాన్‌ మెరిసింది. ఈసారే కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విభాగంలో నిత్యశ్రీ 21-14, 21-6 తేడాతో ఇండోనేషియాకు చెందిన మర్లినాను చిత్తుగా ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్‌ నెంబర్‌వన్‌ నిత్యశ్రీ ఈ మ్యాచ్‌ను కేవలం 23 నిమిషాల్లోనే ముగించింది. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇది ఐదో పతకం కావడం విశేషం. ఇప్పటికే నితేశ్‌, సుహాస్‌, తులసీమతి, మనీష పతకాలు సాధించగా ఇప్పుడు ఆ జాబితాలో నిత్యశ్రీ చేరింది.