Haryana Assembly Polls 2024: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియాతో భేటీ అయ్యారు. కశ్మీర్‌కి బయల్దేరే ముందు ఈ ఇద్దరితోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇద్దరు రెజ్లర్లు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది. ఇలాంటి సమయంలో రాహుల్‌తో భేటీ అవడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను త్వరలోనే ఖరారు చేయనుంది. అయితే...ఈ ఇద్దరికీ కాంగ్రెస్ తరపున టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇలా ప్రచారం జరుగుతోందే తప్ప కాంగ్రెస్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం హరియాణా అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి వరకూ 34 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. తుది జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించనుంది. ఈ లిస్ట్‌లో బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ పేర్లు కూడా ఉంటాయా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ విషయమై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అధికారులను ప్రశ్నించగా త్వరలోనే క్లారిటీ వస్తుందని సమాధానం దాటవేశారు. అప్పటి నుంచి ఈ ప్రచారం ఇంకాస్త పెరిగింది. ఒకవేళ ఇదే జరిగితే వినేశ్ ఫొగాట్ పొలిటికల్ ఎంట్రీ ఆసక్తికరంగా మారనుంది. 




WFI చీఫ్ బ్రిజ్ భూషణ్‌ సింగ్‌పై గతంలో వినేశ్ ఫొగాట్ సహా మహిళా రెజ్లర్‌లు తీవ్ర ఆరోపణలు చేశారు. లైంగికంగా వేధించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కొద్ది రోజులు రెజ్లర్లు నిరాహార దీక్ష కూడా చేశారు. విచారణకు కమిటీ వేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చాక వాళ్లు ఆ దీక్షను విరమించారు. ఇప్పుడు వినేశ్ ఫొగాట్ రాజకీయాల్లోకి వస్తే ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నాలుగు రోజుల క్రితమే శంభు సరిహద్దు వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలకు వినేశ్ ఫొగాట్ మద్దతు తెలిపారు. రైతులు ఆమెని స్వాగతించి పూలదండతో సత్కరించారు. తమకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం మొదలైంది. హరియాణాలో అక్టోబర్ 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల ఆందోళనలు, రెజ్లర్ల నిరసనలు..ఈ అంశాలన్నీ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి.