4th september 2024 School News Headlines Today:


నేటి వార్తలు ( 04-09-2024)


ఆంధ్ర ప్రదేశ్ వార్తలు: 



  • భారీ వర్షాలు, వరదలకు విజయవాడ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బంగాళఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడనుందన్న వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

  • ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర 5.25 లక్షల క్యూసెక్కులుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. 30 గంటల్లో 6.5 లక్షల క్యూసెక్కుల వరద తగ్గింది.


Read Also: Chandrababu : చంద్రబాబు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం పబ్లిసిటీ స్టంటా ? సీఎం బయటకు రాకపోయినా పనులు జరిగిపోతాయా ?


తెలంగాణ వార్తలు: 



  • తెలంగాణలో కురిసిన కుండపోత వర్షాలు వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వర్షాలు, వరదల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. వరదల వల్ల ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలు అధికంగా దెబ్బతిన్నాయి. సూర్యాపేట, భద్రాది ములుగులోను తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 1900 కి. మీ మేర రహదారులు దెబ్బతిన్నాయి.

  • తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

  • తెలంగాణలో నేడు డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్ష ఫైనల్ 'కీ'ని విడుదల చేసే అవకాశం ఉంది. తుది 'కీ' విడుదలైన తర్వాత రెండు, మూడు రోజుల్లోనే డీఎస్సీ మార్కులకు 80 శాతం, టెట్ మార్కులు 20 శాతం కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టును అధికారులు విడుదల చేయనున్నారు.

  • మహిళలు సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి లేకుండా దేశ పురోగతి సాధ్యం కాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహిళలను అర్థం చేసుకునే, చూసే విధానంలో మార్పు రావాలని ఆమె తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ రంగాల్లో మహిళల చురుకైన భాగస్వామ్యం అవసరమన్నారు.


జాతీయ వార్తలు: 



  • కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెంగ్యూ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దీనిని అంటువ్యాధిగా ప్రకటిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులోని నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించనున్నట్టు తేల్చి చెప్పింది. గతేడాది కర్ణాటకలో 5వేల కేసులు నమోదవ్వగా.. 2024లో ఇప్పటికే 24,500 కేసులు నమోదయ్యాయి.

  • ఉత్తరప్రదేశ్ లో తోడేళ్ల వరుస దాడులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తోడేళ్ల దాడుల్లో ఇప్పటికే 10 మంది మరణించగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తోడేళ్లపై ‘షూట్ ఎట్‌ సైట్‌’ ఆదేశాలు జారీ చేసింది. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. తోడేళ్లను పట్టుకునేందుకు అధికారులు ఆపరేషన్‌ భేడియా ప్రారంభించారు.

  • ఛత్తీస్ ఘడ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. బీజాపూర్- దంతేవాడ సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


క్రీడా వార్తలు: 



  • పాకిస్థాన్‌ గడ్డపై బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్.. బంగ్లాదేశ్ మధ్య జరిగిన 2 టెస్టుల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0తో వైట్‌వాష్ చేసింది. రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్‌ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సులభంగానే సాధించింది. తొలి టెస్టులో పాకిస్థాన్‌ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

  • పారాలింపిక్స్‌లో  భారత్‌ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. హైజంప్‌లో రెండు, జావెలిన్‌త్రోలో రెండు పతకాలు కలిపి మొత్తం భారత పతకాలు 20 కి చేరాయి.  


Read Also : Pakistan Cricket: ఓ విండీస్! ఓ శ్రీలంక! ఓ పాకిస్థాన్‌, పతనం దిశగా దాయాది జట్టు


మంచిమాట: ఒత్తిళ్ళు అమ్మ పొత్తిళ్ళు అనుకో.. విజయం నిన్ను వరిస్తుంది.