Woreld Deaf Championships: మీకు గుర్తుందా... గురుకులంలో గురువు ద్రోణాచార్యుడి దగ్గర  శిక్షణ తీసుకుంటున్న సమయంలో అర్జునుడు... పక్షి కన్నుకు గురి పెట్టిన కథ మీకు గుర్తుందా.. మిగిలిన శిష్యులందరూ చెట్టు కనపడుతుందని... పక్షి కనపడుతుందని సమాధానాలు చెప్పగా.. అర్జునుడు మాత్రం తనకు పక్షి కన్ను ఒక్కటే కనపడుతుందని చెప్పి గురిచూసి ఆ లక్ష్యాన్ని ఛేదిస్తాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. మన తెలుగు అర్జునుడి గురించి మీకు సమగ్రంగా చెప్పేందుకు. మన అర్జునుడి పేరు ధనుష్‌ శ్రీకాంత్‌(Dhanush Srikanth). "నాకు చెవులు వినపడవు.. మాటలు కూడా రావు.. అయినా నేను వీటిని పట్టించుకోను. నేను బరిలోకి దిగితే నా గురి లక్ష్యంపైన మాత్రమే ఉంటుంది. నా ఆలోచన నాకు వచ్చే పతకాల మీద తప్ప... నాకు ఉన్న లోపంపైన ఉండదు.” ఇది ధనుష్‌ చెప్పే మాట. అర్జునుడికి ఆ పక్షి కన్ను మీద మాత్రమే దృష్టి ఉంటే.. మన ధనుష్‌కి ఆ పతకాల మీదే గురి. 

 






 

ఈసారి గురి తప్పలేదు...

జర్మనీ(Germany)లోని హనోవర్‌(Hanover)లో జరగుతున్న ప్రపంచ బధిరుల షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన ధనుష్‌ శ్రీకాంత్‌  రెండో పతకం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ధనుశ్ శ్రీకాంత్‌- మహిత్ సంధు స్వర్ణం సాధించి సత్తా చాటింది. ఫైనల్లో భారత్‌కే చెందిన నటాషా జోషి–మొహమ్మద్‌ ముర్తజా జంటపై ధనుశ్‌ జోడీ విజయం సాధించింది. ఈ ప్రపంచ బధిరుల షూటింగ్ ఛాంపియన్‌ షిప్‌లో భారత్‌ ఇప్పటికే మూడు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 12 పతకాలు సాధించింది.

 


 

అనితర సాధ్యం ఆ పయనం

ధనుష్‌ శ్రీకాంత్‌ బధిరుడు. చెవులు వినపడవు. మాటలు రావు ఈ వైకల్యంతో ధనుష్‌ కుంగిపోలేదు. లోపం తన శరీరానికే కానీ తన లక్ష్యానికి కాదని నిరూపించాడు. ఎన్నో అవమానాలను దిగమింగుతూ లక్ష్యం దిశగా పయనిస్తున్నాడు. డెఫ్‌లింపిక్స్‌లోనూ ధనుష్‌ రెండు స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు. మామూలు షూటర్లతోనూ ధనుష్‌ పోటీపడుతూ సత్తా చాటుతున్నాడు. హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో షూటర్‌ గగన్‌ నారంగ్‌ సర్‌ 'గన్‌ ఫర్‌ గ్లోరీ' అకాడమీ ఏర్పాటు చేశారు.

ఈ అకాడమీలో 2015లో చేరిన ధనుష్‌.. తక్కువ కాలంలోనే మంచి షూటర్‌గా ఎదిగాడు. ధనుష్‌ వ్యక్తిగత కోచ్‌ నేహా చవాన్‌తో పాటు అక్కడున్న వాళ్లంతా ధనుష్‌ కోసమే ప్రత్యేకంగా సంజ్ఞల భాష నేర్చుకున్నారు. 2019 ఖేలో ఇండియా క్రీడల్లో 16 ఏళ్లకే అండర్‌-21లో 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్లో ధనుష్‌ స్వర్ణ పతకం గెలిచాడు. 2019లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు గెలిచాడు. జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ స్వర్ణం గెలిచాడు.