YS Jagan in Vijayawada: వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. బాధితులను ఆదుకునేందుకు ఏమీ చేయడం లేదని అన్నారు. ఎక్కడా రిలీఫ్ క్యాంపులు లేవని, నిరాశ్రయులైన వారిని తరలించడం కూడా జరగడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి చంద్రబాబు అనర్హుడని అన్నారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నప్పటికీ.. అధికారులు అందరికీ తనకు నచ్చినట్లుగా పోస్టింగ్‌లు ఇచ్చుకున్నారని అన్నారు. అలాంటి అధికారులు తప్పు చేసేలా చంద్రబాబు ఎలా వ్యవహరించారని జగన్ ప్రశ్నించారు. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో నీట మునిగిన కాలనీల్లో వైఎస్ జగన్ పర్యటించారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.


ఇది పూర్తిగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. క్రిష్ణా నది కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటిని ముంపు నుంచి కాపాడేందుకే క్రిష్ణాలోని నీటిని బుడమేరులోకి గేట్లు ఎత్తి వదిలారని జగన్ మరోసారి చెప్పారు. దాని వల్లనే బుడమేరు నుంచి వరద విజయవాడను ముంచెత్తిందని అన్నారు. గురువారమే వరద రాబోతోందని తెలిసినప్పుడు.. డ్యామ్ మేనేజ్‌మెంట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 


చంద్రబాబు ఇల్లు మునిగింది
‘‘వర్షాలు భారీగా కురుస్తాయని ముందే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాంటప్పుడు కనీసం కాస్తో కూస్తో ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటిదాకా ఎక్కడా రిలీఫ్‌ క్యాంప్‌లు లేవు. విజయవాడలో ఏ కాలనీకి వెళ్లినా వరద బాధితులు అల్లాడుతున్నారు. ఇప్పటికే క్రిష్ణా వరదతో చంద్రబాబు కరకట్ట ఇల్లు మునిగిపోయింది. తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టే కలెక్టరేట్‌ కార్యాలయంలో చంద్రబాబు బస చేస్తూ.. తాను బిల్డప్‌ ఇస్తున్నారు.


వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఉండగా ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదు. అప్పట్లో గోదావరి నదికి వరదలు వస్తే దాదాపు 40 వేల మందికి 30 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం. ఆ సమయంలో ముందుగానే రిలీఫ్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం. వాలంటీర్లు ముందుగానే అప్రమత్తం అయ్యేవారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందరం కలిసి రిలీఫ్‌ క్యాంప్‌కు వరద బాధితులను తరలించేవాళ్లు. వరద ప్రభావం తగ్గిన తర్వాత ఉత్తి చేతులతో పంపకుండా తక్షణం పరిహార సొమ్మును అందించాం.


వర్షాల గురించి ముందస్తు సమాచారం తెలిసినప్పుడు సరైన సమీక్ష చేసి.. సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించి, ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉంటే ఇంతటి నష్టం జరిగి ఉండేది కాదు. 4 నెలల్లో అధికారులు అందరినీ మార్చేశారు. ఇప్పుడు అధికారుల్ని తప్పుబడుతూ వారిని సస్పెండ్ చేస్తున్నారు. తాను చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను ఒప్పుకోవాలి. వాలంటీర్‌ వ్యవస్థ ఉంటే ఇలా జరిగి ఉండేదే కాదు. 


నాకు థ్యాంక్యూ చెప్పారు
రిటైనింగ్‌ వాల్‌ కూడా ఈ వరదల నుంచి బాగా కాపాడింది. మా ప్రభుత్వమే దాన్ని నిర్మించింది. లేకుంటే కృష్ణలంక మునిగిపోయేది. మొన్న రీటైనింగ్ వాల్ ను పరిశీలించేందుకు వెళ్లినప్పుడు కూడా నన్ను అక్కడి ప్రజలు ఆపి థ్యాంక్యూ చెప్పారు’’ అని జగన్ మాట్లాడారు.