Andhra Pradesh And Telangana Floods: మిన్ను-మన్ను ఏకమైనట్లు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని చాలా ప్రాంతాలు నీళ్లలో మునిగాయి. ముఖ్యంగా... హైదరాబాద్‌, విజయవాడ, ఖమ్మం నగరాల్లో జలం విలయం సృష్టించింది. ఆ వరదల్లో కార్లు, బైకులు, ఆటోలు సహా చాలా మోటారు వాహనాలు కొట్టుకుపోయాయి లేదా నీటిలో మునిగిపోయాయి. మీ వాహనం కూడా వరద నీళ్లలో మునిగిపోతే, మీ వాహనానికి ఇన్సూరెన్స్‌ చేయించి ఉంటే, ఆ బీమా మొత్తాన్ని మీరు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 


వరద నీటిలో కార్‌ మనిగితే జరిగే డ్యామేజీలు



  • వరద నీటిలో మీ కారు మునిగితే ఇంజిన్‌లోకి నీరు చేరుతుంది, ఇంజిన్‌ దెబ్బతింటుంది.

  • గేర్‌ బాక్స్‌లోకి కూడా బురద చేరి ఆ యూనిట్‌ బిగుసుకుపోతుంది.

  • కార్‌ సిగ్నల్ లైట్లు, స్పీడోమీటర్, ఇండికేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినవచ్చు.

  • కార్‌ సీట్లు, సీట్ కవర్లు, కుషన్‌లు, కార్పెట్‌ సహా ఇంటీరియర్ వర్క్‌కు నష్టం జరుగుతుంది.


వాహన నష్టాన్ని ఏ రకమైన బీమా కవర్ చేస్తుంది?
మీ కార్‌కు కాంప్రహెన్సివ్‌ ఇన్సూరెన్స్ కవరేజ్‌ (Comprehensive insurance coverage) ఉంటే, మీరు ఒడ్డున పడ్డట్లే. మీ కార్‌కు జరిగిన డ్యామేజీకి ఇన్సూరెన్స్‌ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. కాంప్రహెన్సివ్‌ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌లో మాత్రమే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే (Acts Of God) నష్టాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఒక విషయం గమనించాలి. ఈ తరహా పాలసీల్లో కూడా ప్రకృతి విలయం వల్ల జరిగే నష్టాలకు కవరేజీ తీసుకోవాలా, వద్దా అన్నది కస్టమర్‌ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీరు కార్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే ముందే పేపర్లను జాగ్రత్తగా చదవాలి. 


మనిషికి సంబంధం లేకుండా జరిగిన నష్టాలతో (ప్రకృతి విపత్తులు) పాటు, మానవుల వల్ల జరిగే విపత్తులు, ప్రమాదాలకు కూడా కవరేజ్‌ ఉండేలా సమగ్ర బీమా పాలసీ  (Comprehensive insurance policy) తీసుకోవడం మంచిది. మీ వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ ఉన్నప్పటికీ వరదల్లాంటి విపత్తులకు కవరేజ్‌ ఉండదు.


కారు ఇన్సూరెన్స్‌ను ఎలా లెక్కగడతారు?
కారు కోసం తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ విలువ ఆధారంగా ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని లెక్కగడతారు. ముందుగా... కారుకు డ్యామేజీ జరిగితే రిపేర్‌ చేస్తారు. పాడైపోయిన విడిభాగాల స్థానంలో కొత్తవి బిగిస్తారు. కారు తరుగుదల (Depreciation) ఆధారంగా నిర్ణయించిన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ‍‌(Insured declared value) ప్రకారం కవరేజ్‌ నిర్ణయిస్తారు. కార్‌ ఇన్సూరెన్స్‌ కోసం క్లెయిమ్‌ చేసుకున్నప్పుడు డిప్రిసియేషన్‌ లెక్కిస్తారు కాబట్టి, ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి లభించే పరిహారం మీ కారు వయస్సుపై ఆధారపడి ఉంటుంది. 


మీ కార్‌ కోసం తీసుకున్న ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లో ఇంజిన్ ప్రొటెక్షన్ ఆప్షన్ కూడా ఉంటే, దానిని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కవరేజ్‌ లేకపోతే, ఇంజిన్ రిపేర్‌ కోసం లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కార్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే సమయంలోనే "జీరో డిప్రిసియేషన్" యాడ్-ఆన్‌ను కొనుగోలు చేసి ఉంటే, డిప్రిసియేషన్‌ లేకుండా పరిహారం పొందొచ్చు.


కార్‌ ఇన్సూరెన్స్‌ ఎలా క్లెయిమ్ చేయాలి?
వరద నీళ్లలో మీ కార్‌ మునిగిపోయిన విషయాన్ని మీ ఇన్సూరెన్స్‌ కంపెనీకి వెంటనే తెలియజేయండి. ఇందుకోసం, ప్రతి ఇన్సూరెన్స్‌ కంపెనీకి టోల్ ఫ్రీ నంబర్‌ ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ నంబర్‌ కనిపిస్తుంది. కార్ కంపెనీకి విషయాన్ని చేరవేయండి.
కారు మునిగిపోయినప్పుడు లేదా వరద నీళ్లలో కొట్టుకుపోయినప్పుడు ఫొటోలు లేదా వీడియోలు తీయడం ఉత్తమం. జరిగిన నష్టానికి ఇవి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి.


మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), మీ డ్రైవింగ్ లైసెన్స్ (DL), ఇన్సూరెన్స్‌ పాలసీ పేపర్లు, ఇతర అవసరమైన పత్రాలన్నీ దగ్గర పెట్టుకోండి.
ఫొటోలు లేదా వీడియోలు, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను జత చేసి ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఇ-మెయిల్‌ కూడా పంపండి. మీ ఇ-మెయిల్‌ కంపెనీకి చేరగానే, మీకు ఒక ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ నంబర్‌ అందుతుంది. ఈ నంబర్‌తో ఇన్సూరెన్స్‌ స్టేటస్‌ చెక్‌ చేయవచ్చు.


ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి ఒక ఆఫీసర్‌ (సర్వేయర్‌) కూడా వస్తాడు. అతను అడిగిన పత్రాలన్నీ ఇవ్వండి. వరద వల్ల మీ కారుకు ఎంత నష్టం జరిగింది, ఏయే పరికరాలు/విడిభాగాలను మార్చాలి లేదా మరమ్మతు చేయించాలి, దీనికోసం ఎంత ఖర్చవుతుందో ఇన్సూరెన్స్‌ ఆఫీసర్‌ లెక్కిస్తాడు.


కారుకు జరిగిన డ్యామేజీని సర్వేయర్‌ పరిశీలించి కంపెనీకి రిపోర్ట్‌ పంపుతాడు. ఆ తర్వాత, మీ కారును రిపేర్‌ కోసం మీ ఇన్సూరెన్స్‌ కంపెనీ అక్కడి నుంచి తరలిస్తుంది. అయితే.. కారును రిపేర్‌ షాప్‌ వరకు తీసుకెళ్లడం, రికవరీ కూడా ఇన్సూరెన్స్‌ కవరేజ్‌లో భాగంగా ఉండాలి. ఇన్సూరెన్స్ ప్లాన్‌ తీసుకునే సమయంలోనే ఈ అంశాలు ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి.


అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత, మీ కార్‌కు జరిగిన డ్యామేజీని బట్టి, మీకు లభించే బీమాకు సంబంధించిన సమాచారంపై ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎప్పటికప్పుడు SMSలు, ఇ-మెయిల్స్‌ పంపుతుంది. మీరు కూడా ఇ-మెయిల్ లేదా టోల్ ఫ్రీ నంబర్‌ ద్వారా కంపెనీతో మాట్లాడి, మీ సందేహాలు తీర్చుకోవచ్చు.


మరో ఆసక్తికర కథనం: భారీగా పడిపోయిన వెండి రేటు, గోల్డ్‌ స్థిరం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి