ICC Mens T20I Team:


ఐసీసీ 2022 ఏడాదికి గాను పురుషుల టీ20 జట్టును ప్రకటించింది. టీమ్‌ఇండియా నుంచి ముగ్గురు క్రికెటర్లకు చోటిచ్చింది. టోర్నీ టాప్‌ స్కోరర్‌ విరాట్‌ కోహ్లీ, పడుకొని మరీ చితక బాదేసిన సూర్యకుమార్‌ యాదవ్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌ను టీ20 ప్రపంచపక్‌ విజేతగా నిలిపిన జోస్‌ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది.


ఐసీసీ ఎంపిక చేసిన జట్టులో ముగ్గురు ఆటగాళ్లున్నది కేవలం భారత్‌ నుంచే కావడం ప్రత్యేకం. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ నుంచి చెరో ఇద్దరు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే, శ్రీలంక నుంచి ఒక్కో క్రికెటర్‌ ఎంపికయ్యారు. ఏడాది సాంతం మెరుగైన ఆటతీరు కనబరిచిన ఆటగాళ్లనే తీసుకోవడం గమనార్హం.


'విరాట్‌ కోహ్లీ 2022లో తన విరాట్‌ రూపాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఆసియాకప్‌లో తుపాను సృష్టించాడు. ఐదు మ్యాచుల్లో 276 పరుగులతో రెండో అత్యధిక టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గానిస్థాన్‌పై ఆఖరి మ్యాచులో శతకం బాదేసి సెంచరీల కరవు తీర్చుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ అతడిదే ఫామ్‌ కొనసాగించాడు. మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌పై చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయం అందించాడు. ఆ తర్వాత మరో మూడు హాఫ్‌ సెంచరీలు కొట్టాడు. 296 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు' అని ఐసీసీ వెల్లడించింది.


Also Read: మూడో వన్డేలో కోహ్లీ రికార్డును కొట్టనున్న హిట్‌మ్యాన్ - కేవలం ఏడు దూరంలోనే!


గతేడాది పొట్టి క్రికెట్లో సూర్యకుమార్‌ యాదవ్‌ తిరుగులేని ఇన్నింగ్సులు ఆడాడు. 1164 పరుగులతో ఈ ఏడాదిలోనే అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అంతేకాకుండా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ పొజిషన్ అందుకున్నాడు.


'2022లో సూర్యకుమార్‌ యాదవ్ సంచలన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ ఫార్మాట్లో ఒకే ఏడాదిలో వెయ్యికి పైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 1164 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా అవతరించాడు. 187.43 స్ట్రైక్‌రేట్‌తో రెండు సెంచరీలు, తొమ్మది హాఫ్‌ సెంచరీలు చితకబాదాడు' అని ఐసీసీ తెలిపింది. 'టీ20 ప్రపంచకప్‌లోనూ సూర్యకుమార్‌ తన జోరు ప్రదర్శించాడు. 189.68 స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఐసీసీ టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో 2022ను ముగించాడు' అని పేర్కొంది.


Also Read: ఆ రెండు పదాలతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ను థ్రిల్‌ చేసిన జడ్డూ!


Also Read: పంత్‌పై ప్రేమ చాటుకున్న క్రికెటర్లు - ఉజ్జయిని మహా కాళేశ్వరునికి ప్రత్యేక పూజలు


ఐసీసీ టీ20 జట్టు: జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్థాన్‌), విరాట్‌ కోహ్లీ (భారత్), సూర్యకుమార్‌ యాదవ్‌ (భారత్), గ్లెన్ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌), సికిందర్‌ రజా (జింబాబ్వే), హార్దిక్‌ పాండ్య (భారత్‌), సామ్‌ కరన్‌ (ఇంగ్లాండ్‌), వనిందు హసరంగ (శ్రీలంక), హ్యారిస్‌ రౌఫ్‌ (పాకిస్థాన్‌), జోష్ లిటిల్‌ (ఐర్లాండ్‌)