Indian Cricketers: 


టీమ్‌ఇండియా క్రికెటర్లు మరోసారి రిషభ్ పంత్‌పై ప్రేమను చాటుకున్నారు. అతడు వేగంగా కోలుకోవాలని ఉజ్జయిని శ్రీ మహా కాళేశ్వరుని ప్రార్థించారు. సోమవారం ఉదయమే జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నారు. చితా భస్మంతో అభిషేకం చేశారు. మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌, మణికట్టు మాంత్రికుడు కుల్‌దీప్‌ యాదవ్‌, యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు సహాయ సిబ్బంది మహా కాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.


'రిషభ్ పంత్‌ వేగంగా కోలుకోవాలని మేమంతా ప్రార్థించాం. అతడి పునరాగమనం మాకెంతో కీలకం. న్యూజిలాండ్‌పై మేమిప్పటికే సిరీస్‌ గెలిచాం. ఆఖరి మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం' అని సూర్యకుమార్‌ యాదవ్‌ ఏఎన్‌ఐతో చెప్పాడు. వేకువ జామునే మహాకాళేశ్వరుని సేవించే 'భస్మ హారతి'లో పాల్గొన్నామని వివరించారు. ఆటగాళ్లంత సంప్రదాయ వస్త్రాలే ధరించడం గమనార్హం. ధోవతి, అంగవస్త్రం ధరించి ఆలయంలో పూజలు చేశారు.




ఫ్యూచర్‌ స్టార్‌ రిషభ్ పంత్‌ రూర్కీలో కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తలపై గాట్లు, వీపుపై కాలిన గాయాలు, మోకాలి లిగమెంట్లలో చీలక, పాదాల్లో ఎముకల స్థానభ్రంశం జరిగింది. ప్రమాదంలో అతడి కారు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు అతడు కారులోంచి బయటకు దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొదట పంత్‌కు డెహ్రాడూన్‌లో చికిత్స అందించారు. ఆ తర్వాత ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రికి ఎయిర్‌లిఫ్ట్‌ చేశారు. డాక్టర్‌ పార్ధీవాల నేతృత్వంలో మోకాలి లిగమెంట్లకు శస్త్రచికిత్స చేశారు. మరో సర్జరీ చేయాల్సి ఉంది.


వికెట్‌ కీపర్‌ కావడంతో రిషభ్ పంత్‌ కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టనుంది. ఎందుకంటే కీపింగ్‌ చేసేందుకు అతడు నిరంతరం మోకాళ్లు వంచి కూర్చోవాల్సి ఉంటుంది. బంతులు అందుకొనేందుకు కుడి, ఎడమ వైపు డైవ్స్‌ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే అతడి మోకాళ్ల కండరాలు, ఎముకలు బలంగా ఉండాలి. అందుకే శస్త్రచికిత్స తర్వాత బెంగళూరులోని ఎన్‌సీఏలో అతడు ఎక్కువ సమయం రిహబిలిటేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.




ఈ ఏడాది ఐపీఎల్‌, వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌నకు పంత్‌ అందుబాటులో ఉండడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌, జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ ఆడడు. సెప్టెంబర్లో ఆసియాకప్‌నకూ దూరమవుతాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ భాగం ఆడడు. అందులో కీలకమైన బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ మరికొన్ని రోజుల్లోనే మొదలవుతోంది. ఒకవేళ టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరుకుంటే ఇంగ్లాండ్‌లో అతడి సేవలు అత్యంత కీలకం.