Pujara On Pat Cummins:


తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అని టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా అంటున్నాడు. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో అతడిని ఎదుర్కోవడం సులభం కాదని పేర్కొన్నాడు.


భారత్‌, ఆస్ట్రేలియా మరోసారి నాలుగు టెస్టుల సిరీసుకు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ మొదలవుతోంది. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా ఆడుతున్న సుదీర్ఘ సిరీసు ఇదే కావడం గమనార్హం. కంగారూలతో పోరంటే ముందుగా గుర్తొచ్చేది పుజారానే. అత్యంత కట్టుదిట్టంగా బంతులేసే బౌలర్లను అతడు ధైర్యంగా ఎదుర్కొంటాడు. దేహానికి గాయాలు తగిలినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో క్రీజులో నిలబడి సెంచరీలు సాధిస్తాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో గ్లెన్‌ మెక్‌గ్రాత్‌కు పుజారా ఇంటర్వ్యూ ఇచ్చాడు.


Also Read: మూడో వన్డేలో కోహ్లీ రికార్డును కొట్టనున్న హిట్‌మ్యాన్ - కేవలం ఏడు దూరంలోనే!


'నేను కమిన్స్‌ పేరే చెబుతాను. ఆస్ట్రేలియాలో అతడిని ఎదుర్కోవడం అత్యంత కష్టం' అని మెక్‌గ్రాత్‌ అడిగిన ప్రశ్నకు పుజారా చెప్పాడు. బ్రియాన్‌ లారాతో కలిసి బ్యాటింగ్‌ చేయడం తనకు ఇష్టమని అతడు పేర్కొన్నాడు. 'లారాతో నేనెలాంటి క్రికెట్‌ ఆడలేదు. గతంలో ఐపీఎల్‌లో ఉన్నాను కానీ అతడితో కలిసి ఆడే అవకాశం రాలేదు' అని వివరించాడు. తనకు అత్యంత ఇష్టమైన టెస్టు ఇన్నింగ్స్‌ ఏదని ప్రశ్నించగా 2017లో బెంగళూరులో ఆసీస్‌పై చేసిన 92 పరుగులు ఇన్నింగ్స్‌ ఇష్టమని చెప్పాడు.


ఏడాది నుంచి చెతేశ్వర్‌ పుజారా విజృంభించి ఆడుతున్నాడు. కౌంటీ సీజన్లో ససెక్స్‌ తరఫున పరుగుల వరద సృష్టించాడు. వరుస డబుల్‌ సెంచరీలు సాధించాడు. పైగా వన్డేల్లోనూ సెంచరీలు కొట్టాడు. ఇక నాలుగేళ్లలో తొలి సెంచరీ బంగ్లాదేశ్‌పై అందుకున్నాడు. అంతకు ముందు టీమ్‌ఇండియా తరఫున 2019లో బోర్డర్‌-గావస్కర్‌ టెస్టు సిరీసులో సెంచరీ చేయడం గమనార్హం.


మరికొన్ని రోజుల్లో భారత్‌, ఆస్ట్రేలియా అత్యంత కీలకమైన బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో తలపడుతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచే నాలుగు టెస్టుల సిరీసు మొదలవుతోంది. టీమ్‌ఇండియా తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. ఆసీస్‌ 18 మందిని ఎంపిక చేసింది.


Also Read: ఆ రెండు పదాలతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ను థ్రిల్‌ చేసిన జడ్డూ!


Also Read: పంత్‌పై ప్రేమ చాటుకున్న క్రికెటర్లు - ఉజ్జయిని మహా కాళేశ్వరునికి ప్రత్యేక పూజలు


భారత జట్టు : రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎస్ భరత్‌, ఇషాన్‌ కిషన్, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌


ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్‌ కమిన్స్‌, ఏస్టన్‌ ఆగర్‌, స్కాట్‌ బొలాండ్‌, అలెక్స్‌ కేరీ, కామెరాన్‌ గ్రీన్‌, పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, జోష్ హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌, నేథన్ లైయన్‌, లాన్స్‌ మోరిస్‌, టాడ్‌ మార్ఫీ, మాథ్యూ రెన్షా, స్టీవ్‌స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌, డేవిడ్‌ వార్నర్‌