AUS vs SA: టీ20లలో ఆస్ట్రేలియాకు ఇటీవలే కొత్త సారథిగా నియమితుడైన మిచెల్ మార్ష్ తొలి మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. దక్షిణాఫ్రికాతో డర్బన్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20లో ఆసీస్‌కు ఘన విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్ (49 బంతుల్లో 92 నాటౌట్, 13 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాటు చివర్లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ (28 బంగుల్లో 64, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది.
మార్ష్ - డేవిడ్ షో..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూలకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్ (6) నిరాశపరచగా మరో ఓపెనర్ మాథ్యూ షార్ట్ (11 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ (1), మార్కస్ స్టోయినిస్ (6) కూడా విఫలమయ్యారు. దూకుడుగా ఆడి ఆరు ఓవర్లలోనే 70 పరుగులు చేసిన ఆసీస్.. ఆ ఓవర్ ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఆసీస్‌ను మార్ష్ - డేవిడ్ ఆదుకున్నారు.
ఈ ఇద్దరూ సఫారీ బౌలర్లను ఆటాడుకున్నారు. ఇద్దరూ పోటీ పడుతూ మరీ బంతిని బౌండరీ లైన్ దాటించారు. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరూ 103 పరుగులు జోడించారు. 16వ ఓవర్లో డేవిడ్ నిష్క్రమించినా ఆరోన్ హార్డీ (14 బంతుల్లో 23, 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ఆసీస్ స్కోరును 200 దాటించాడు. సఫారీ బౌలర్లలో జాన్సెన్, ఎంగిడి, కొయెట్జ్, విలియమర్స్, షంషిలు తలా నాలుగు ఓవర్లు వేసి ప్రతీ ఒక్కరూ 40 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు.
సఫారీల తడబాటు..
భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు ఆది నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్లోనే స్టోయినిస్.. టెంబ బవుమాను డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (56), రస్సి వాన్ డర్ డసెన్ (21) లు ధాటిగా ఆడేందుకు యత్నించారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. కానీ సీన్ అబాట్.. డసెన్‌ను ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత సఫారీలు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయారు. కెప్టెన్ మార్క్‌రమ్ (7), తొలి మ్యాచ్ ఆడిన బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (5), ట్రిస్టన్ స్టబ్స్ (0)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. భారత సంతతి స్పిన్నర్ తన్వీర్ సంఘా వీల్ల పనిపట్టాడు. మార్కో జాన్సెన్ (20) ను కూడా అతడే ఔట్ చేశాడు. హెండ్రిక్స్, డసెన్, జాన్సెన్ మినహా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో దక్షిణాఫ్రికా.. 15.3 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్.. 111 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం ఇదే వేదికగా జరుగనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial