WTC Final, South Africa vs Australia, Australia Playing 11: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య బుధవారం (జూన్ 11) నాడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ (ICC World Test Championship) మ్యాచ్ ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తన ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించింది. 

డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియాకు ఓపెనర్ సమస్య ఉంది. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత నలుగురు ఆటగాళ్లను ఓపెనర్లుగా టెస్టు చేసినా ఫలితం రాలేదు. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మరో కొత్త బ్యాటర్ ఓపెనింగ్ చేస్తాడు. సీనియర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ లతో పాటు సామ్ కోన్‌స్టాస్, నాథన్ మెక్‌స్వీనీ తర్వాత మార్నస్ లాబుషేన్ ఆసీస్ కొత్త ఓపెనర్ గా మారాడు. 

WTC ఫైనల్ కోసం ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్- 1. ఉస్మాన్ ఖవాజా, 2. మార్నస్ లాబుషేన్, 3. కామెరూన్ గ్రీన్, 4. స్టీవ్ స్మిత్, 5. ట్రావిస్ హెడ్, 6. వెబ్‌స్టర్, 7. అలెక్స్ కారీ  కీపర్), 8. ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), 9. మిచెల్ స్టార్క్, 10. నాథన్ లియన్, 11. హేజిల్‌వుడ్

ఐపీఎల్ తో అందుబాటులోకి వచ్చిన జోష్ హేజిల్‌వుడ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. హేజిల్‌వుడ్ భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్ ద్వారా హేజిల్‌వుడ్ మైదానంలోకి కం బ్యాక్ చేశాడు. కామెరూన్ గ్రీన్‌ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. 

ఆస్ట్రేలియా ప్లేయింగ్ IX చూస్తే జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఉస్మాన్ ఖవాజాతో పాటు మార్నస్ లాబుషేన్ ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగుతాడని మేనేజ్‌మెంట్ తెలిపింది. నాలుగో స్థానంలో స్టీవ్ స్మిత్ ఉండటంతో టాపార్డర్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. 

ఆ తర్వాత 5వ స్థానంలో ట్రావిస్ హెడ్ ఉన్నాడు. ఫైనల్ జరుగుతున్న లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాకు ట్రావిస్ హెడ్ ట్రబుల్ ఇవ్వొచ్చు. ఆ తర్వాత ఆల్ రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ బ్యాటింగ్ కు వస్తాడు. ఆ తరువాత వికెట్ కీపర్ అలెక్స్ కారీ, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్ ఉన్నాడు. జోష్ హేజిల్‌వుడ్ లాస్ట్ బ్యాటింగ్ కు వస్తాడు. స్టార్క్, పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్ లతో పేస్ బౌలింగ్ స్ట్రాంగ్‌గా ఉంది. గ్రీన్, వెబ్‌స్టర్ రూపంలో మీడియం పేసర్లు ఉన్నారు. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ నాథన్ లయన్ ఎలాగూ ఉన్నాడు.