RCB IPL 2025 Champions: తమ ఫ్రాంచైజీని అమ్మేస్తురంటూ వస్తున్న ఊహాగానాలపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ స్పందించింది. తాజాగా బీఎస్సీ స్టాక్ ఎక్సచేంజీకి రాసిన లేఖలో దీనిపై స్పష్టత నిచ్చింది. నిజానికి ఇటీవల ఆర్సీబీ ఫ్రాంచైజీ టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఈనెల 3న తొలి టైటిల్ గెలిచి, 18 ఏళ్ల కలను సాకరం చేసుకున్న ఈ జట్టుకు ఆ తర్వాత రోజే షాక్ ఎదురైంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పరిసరాలలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, పదుల సంఖ్యలో అభిమానులు గాయపడ్డారు. అలాగే ఈ దుర్ఘటనపై కన్నెర్ర చేసిన కర్ణాటక ప్రభుత్వం ఫ్రాంచైజీ అధికారులు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏపై కూడా కేసులు నమోదు చేసి పలు అరెస్టులు చేసింది. ఈ నేపథ్యలో ఫ్రాంచైజీలో వాటాను అమ్మడానికి మేనేజ్మెంట్ సిద్ధమైందనే వార్తలు హల్చల్ చేశాయి. ఇన్నాళ్లు అందని ద్రాక్షలా ఉన్న టైటిల్ దక్కడంతోపాటు వివాదాల నుంచి బయట పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తాజాగా ఆర్సీబీ మేనేజ్మెంట్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది.
బీఎస్సీకి లేఖ..ఇక ఆర్సీబీ అమ్మకం వార్తలతో ఆర్సీబీ యాజమాన్యానికి చెందని కంపెనీల షేరు మూడు శాతం ఎగబాకింది. దీంతో రంగంలోకి దిగిన బీఎస్సీ స్టాక్ ఎక్స్ చేంజీ అమ్మకానిపై వివరణ కోరింది. దీనికి జవాబిచ్చిన యాజమాన్యం.. తమకు ఇప్పట్లో ఆర్సీబీని అమ్మే ఉద్దేశం లేదని, ఇవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఐపీఎల్‌ను ప్రారంభ ఎనిమిది జట్లలో ఆర్‌సీబీ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్సీబీ యాజమాని అయిన యునైటెడ్ స్పిరిట్స్‌ను విజయ్ మాల్యా సొంతం చేసుకున్నారు. యునైటెడ్ స్పిరిట్స్‌ను బ్రిటిష్‌కు చెందిన డియాజియో కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆర్‌సీబీ యాజమాన్యం డియాజియోకు వెళ్లింది. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ ఈ ఏడాది తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఆ జట్టు అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే అంతలోనే అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. ఇక బెంగళూరు తొక్కిసలాటాపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ విచారం వ్యక్తం చేశాడు. అలాంటి దుర్ఘటన జరిగి ఉండకుండా చర్యలు తీసుకునే ఉంటే బాగుండేనని వ్యాఖ్యానించాడు.
వ్యవస్థల వైఫల్యం..బెంగళూరు తొక్కిసలాటలో అన్ని రంగాల వైఫల్యం కనిపిస్తోందని మోదీ వ్యాఖ్యానించాడు. ప్రభుత్వ అధికారులతోపాటు టీమ్ మేనేజ్మెంట్ సరిగ్గా ఏర్పాట్లు చేయకుండానే ఇంత భారీ ప్రొగ్రామ్ ఏర్పాటు చేయడం సరికాదని తెలిపాడు. ఇలాంటివి అవాయిడ్ చేస్తే బాగుండేనని పేర్కొన్నాడు. నిజానికి ఉత్సవ వేడుకలను ఆదివారానికి షిఫ్ట్ చేయాలని పోలీసులు సూచించినా, విదేశీ ప్లేయర్లు అందుబాటులో ఉండరంటూ హడావిడిగా ఫ్రాంచైజీ యాజమాన్యం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.