US Open 2023:  అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ యేటి చివరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్‌లో గురువారం సంచలన ఫలితాలు వెలువడ్డాయి.   ప్రపంచ ఐదో ర్యాంకర్, గతేడాది యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌‌గా నిలిచిన  కాస్పర్ రూడ్‌ (నార్వే) తో పాటు గ్రీస్ ఆటగాడు, ఏడో సీడ్  స్టెఫనోస్ సిట్సిపస్‌లూ  టోర్నీ నుంచి నిష్క్రమించారు.  మరోవైపు  ఇటీవలే తిరిగి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న సెర్బియా  స్టార్ నొవాక్ జకోవిచ్   మూడో రౌండ్ చేరాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ కూడా మూడో రౌండ్‌కు చేరింది.  


రూడ్ ఖేల్ ఖతం.. 


భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి  జరిగిన  రెండో రౌండ్ పోటీలలో   67వ ర్యాంకర్  అయిన చైనాకు చెందిన జిజెన్ జాంగ్ చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్‌లో రూడ్‌పై..  4-6, 7-5, 2-6, 6-0, 2-6 తేడాతో జాంగ్ సంచలన విజయాన్ని నమోదుచేశాడు.  ఐదు సెట్లలో   ఏకంగా మూడు గంటల 19 నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠ పోరులో చైనా ఆటగాడు పడుతూ లేస్తూ చివరికి విజేతగా నిలిచాడు. జాంగ్‌కు  అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌లో ఇదే మేజర్ విక్టరీ.  అంతేగాక టెన్నిస్‌‌లో టాప్ - 5 ప్లేయర్లలో ఒకరిని ఓడించడం చైనా చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.   తొలి, మూడో సెట్ కోల్పోయినా జాంగ్.. పట్టువిడవకుండా  పోరాడి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. 


 






సిట్సిపస్‌కూ నిరాశే.. 


ఏడో సీడ్ సిట్సిపస్‌కూ నిరాశ తప్పలేదు.  రెండో రౌండ్‌లో అతడు స్విట్జర్లాండ్‌కు చెందిన అన్ సీడెడ్ డొమినికా స్ట్రైకర్ చేతిలో మట్టికరిచాడు. ఐదు సెట్లలో జరిగిన  ఈ  పోరులో  స్ట్రైకర్.. 7-5, 6-7 (2-7), 6-7 (5-7), 7-6 (8-6), 6-3 తేడాతో  సిట్సిపస్‌పై సంచలన విజాయన్ని నమోదుచేశాడు.  


 






మూడో రౌండ్‌కు జకో.. 


ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగి తనకు అచ్చొచ్చిన యూఎస్ ఓపెన్‌లో మరో టైటిల్ నెగ్గి 24 వ గ్రాండ్ స్లామ్ నెగ్గాలని భావిస్తున్న  జకోవిచ్.. రెండో రౌండ్‌లో6-4, 6-1, 6-1 తేడాతో    స్పెయిన్‌కు చెందిన  బెర్నబె జపట మిరల్స్  పై సునాయసంగా గెలిచాడు.  జకో మూడో రౌండ్‌లో లస్లో జేర్‌తో తలపడతాడు. 


ఉమెన్స్ సింగిల్స్‌లో.. 


మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్, అమెరికా అమ్మాయి కోకో గాఫ్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. బుధవారం ముగిసిన రెండో రౌండ్‌లో గాఫ్.. 6-3, 6-2 తేడాతో రష్యాకు చెందిన మీరా ఆండ్రీవాపై అలవోకగా విజయాన్ని అందుకుంది. గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో  గాఫ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో సీడ్ సబలెంక (బెలారస్) కూడా 6-3, 6-2 తేడాతో ఇటలీ ప్లేయర్ జార్జిని ఓడించింది.  ఈ ఏడాది వింబూల్డన్ విజేత  వొండ్రుసోవా 6-3, 6-0తో  కొరియన్ ప్లేయర్  హాన్ పై నెగ్గి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial