Gummadi Anuradha: రానున్న ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె గుమ్మడి అనురాధ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.  అందులో ఆమె మట్లాడారు. తనను ఓ పార్టీ నేతలు కలిశారని, పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. అయితే తాను మాత్రం రాజీకీయ పార్టీలకు దూరంగా స్వతంత్రంగా పోటీ చేస్తానన్నారు.  ప్రస్తుతం గుమ్మడి అనురాధ ఉస్మానియా పీజీ న్యాయ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌‌గా పని చేస్తున్నారు.


ఆమె ఎమన్నారంటే.. ‘‘నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఇటీవల ఆ పార్టీ నేతలు ఈ అంశంపై నన్ను సంప్రదించిన మాట వాస్తవమే. అయితే నాకు నేనుగా మాత్రం ఏ పార్టీని కలవలేదు. తాజా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితులను స్వయంగా గమనించేందుకు  నియోజకవర్గంలో పర్యటించా. నేను రావాలనుకుంటున్నట్లు ప్రజలకు వివరించా. స్వచ్ఛమైన, స్వేచ్ఛా రాజకీయాలే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావాలని ప్రజలు, విద్యార్థి, ప్రజా సంఘాలు, విప్లవ పార్టీల ప్రతినిధులు స్వాగతించారు. నియోజకవర్గాన్ని కుట్రలు, కబ్జా రాజకీయాల బారినుంచి కాపాడేందుకు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో దిగుతా’’ అని అనురాధ తెలిపారు.  


సీతారామ ప్రాజెక్ట్, బయ్యారం స్టీల్ ప్లాంట్, యువతకు విద్య, ఉపాధి కల్పనే తన రాజకీయ ఎజెండా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇల్లందు రాజకీయాలు కలుషితమయ్యాయని, వాటిని సరిచేసేందుకే తాను రంగంలోకి దిగుతానని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే సీతారామ ప్రాజెక్ట్ దారి మళ్లిందని, బయ్యారం ఉక్కు అన్నారు. మన హక్కు అని చెప్పి గెలిచిన వాళ్లు ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీ టికెట్ తనకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. తాను మాత్రం స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. ఇల్లెందు నియోజకవర్గాన్ని కుట్రలు, కబ్జా రాజకీయాల బారి నుంచి కాపాడేందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు తెలిపారు.


ఇల్లెందు ప్రజలు ఎల్లప్పుడు మంచి వైపే ఉంటారని, తాను స్వచ్ఛమైన రాజకీయాల కోసం పోరాటం చేస్తాన్నారు. ఇల్లెందు ప్రజల కష్టాలను చూశానని, వారి సమస్యలను తీర్చడానికి బరిలో నిలవనున్నట్లు చెప్పారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాని, విద్యార్థి ఉద్యమాల్లో పోరాటం చేశానని ఇప్పుడు అదే స్ఫూర్తితో ఇల్లెందు కోసం పోరాటం చేస్తానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించాలని కోరారు. 


ఇల్లెందు నుంచి ‘మీ తండ్రి పోటీచేస్తే మీరూ బరిలో నిలుస్తారా?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. తమ మధ్య పోటీ ఉండదన్నారు. తన నిర్ణయాన్ని తన తండ్రి స్వాగతించారన్నారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బిడ్డలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఇచ్చారని, ఆయన అనుమతితోనే రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. 25 సంవత్సరాల క్రితం స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి నర్సయ్య చిన్న బడ్జెట్ తోనే గ్రామాల్లో రోడ్లు, స్కూళ్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించారని, గడిచిన పది సంవత్సరాల కాలంలో ఇల్లందు అభివృద్ధిలో వెనుకబడిందన్నారు.