నిన్నటి అవర్తనం ఈరోజు ఈశాన్య & పరిసర ప్రాంతాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ  వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళేకొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (ఆగస్టు 30) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ / వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి వీస్తున్నాయని అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 78 శాతంగా నమోదైంది.


సెప్టెంబరు 2న తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబరు 3న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


ఏపీలో ఇలా
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.


‘‘రుతుపనాలు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా బలంగా ఉంటం వలన వర్షాలు నెల్లూరు, తిరుపతి, దక్షిణ ప్రకాశం కోస్తా భాగాల్లోకి విస్తరిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు నగరంతో పాటుగా నెల్లూరు జిల్లాలోని పలు కోస్తా భాగాల్లోకి వర్షాలు విస్తరిస్తున్నాయి. రానున్న రెండు గంటల వరకు వర్షాలు దక్షిణ కోస్తా భాగాల్లోకి విస్తరించి, మళ్లీ రాత్రి, అర్ధరాత్రి మరో సారి వర్షాలు విస్తరించనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.


ఉత్తరాదిలో తగ్గుతున్న వర్షాలు
దేశ రాజధాని ఢిల్లీలో రానున్న రెండు రోజులు పగటిపూట బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. బలమైన గాలుల కారణంగా, తేమ వేడి నుండి ఢిల్లీ ప్రజలు కొంత ఉపశమనం పొందుతారని వాతావరణ అధికారులు తెలిపారు. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రత 27, గరిష్టంగా 37 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో రానున్న రెండు రోజుల పాటు రాజధానిలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.


IMD అంచనా ప్రకారం.. రానున్న రోజుల్లో ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉండవచ్చు. సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 4 వరకు ఢిల్లీ మేఘావృతమై ఉంటుంది. అలాగే, రాబోయే కొద్ది రోజులు ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో వర్షాలు కురిసే అవకాశం తక్కువ. మంగళవారం రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఎండలు మండుతూనే ఉన్నాయి. దీంతో రోజు గడుస్తున్న కొద్దీ ఎండలు పెరుగుతూనే ఉన్నాయి.