Holi Kama Dahanam 2025: భౌతికంగా ఉండే వాంఛలన్నింటినీ మసిచేసి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలన్నదే కామదహనం వెనుకున్న ఆంతర్యం. ధర్మసింధు ప్రకారం కామదహనం ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు నిర్వహిస్తారు. ఈరోజుని కాముని పున్నమి అంటారు. కాముని పున్నమి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియజేస్తూ ఓ పురాణ గాథ ఉంది.  


తారకాసురుడనే రాక్షసుడు తపస్సు ఆచరించి దేవతల నుంచి వరం పొందుతాడు. దేవతలందర్నీ చిత్రహింసలకు గురిచేస్తాడు. శివుడికి జన్మించిన సంతానం చేతిలోనే తన మరణం అని వరం పొందుతాడు. హిమవంతుడి పుత్రిక అయిన పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసినా పరమేశ్వరుడి మనసు కరగదు. సపర్యలు అన్నీ చేస్తుంది కానీ శివుడు కనీసం కన్నెత్తైనా చూడడు.  శివపార్వతులకు వివాహం చేయాలని దేవతలు భావించి మన్మధుడిని సహాయం అడుగుతారు.  అలా మన్మధుడు పూలబాణం ప్రయోగించడం, తపోభంగం జరిగిందన్న కోపంలో మూడోకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు శివుడు. మన్మథుడు అంటే కాముడు.. కాముడు దహనం అయిన రోజు కనుకే కామదహనం అయింది. అంటే కోర్కెలు దహించే రోజు అని అర్థం.


మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


తపోభంగం తర్వాత పార్వతీదేవితో వివాహం..వారికి కలిగిన సంతానం స్కందుడు. ఆయనకే తారకాసురుడిని సంహరించాడు. ఇక్కడ తారకాసుర సంహారం అంటే అజ్ఞానాన్ని భస్మం చేయడం అని అర్థం. వివాహం అంటే కామం కోసం కాదు..అలాఅని కామం లేకపోవడమూ కాదు. ధర్మం కోసం మాత్రమే కామం అని చెప్పడమే కామదహనం వెనుకున్న పరమార్థం. శంకరుడు కామాన్ని దహించిన సంఘటనకు ప్రతీకగా కాముడి బొమ్మ తయారు చేసి దహనం చేసే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. 


ప్రతి మనిషిలోనూ కాముడు అంతర్లీనంగా దాగి ఉంటాడు. మనిషిలో ఉండే అరిషడ్వర్గాలైన రాగ, ద్వేష, కామ, క్రోధ, మోహం అనే గుణాలు ప్రజ్వరిల్లకుండా అదుపుచేసుకుని మనసుని, శరీరాన్ని అదుపులో పెట్టుకోవడమే కామదహనం అంటే. మనిషిలో కోర్కెలు గుర్రాలుగా మారి స్వారీ చేస్తే జీవితం నిరర్థకంగా మారుతుంది..వాటిని జయించినప్పుడే మనిషి జన్మకు సార్థకత లభిస్తుంది.  కామదహనం చేస్తే పనికిరాని కోర్కెలు తొలగిపోయి మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.  


(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


మరి రంగులెందుకు అంటే హిరణ్య కశిపుడి చెల్లెలు అయినా హోలిక బాధల నుంచి విముక్తి లభించినందుకు. ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రంగులు చల్లుకున్నారు రాజ్యంలో ప్రజలు. ఆ మహోత్సవమే ఇప్పటికీ కొనసాగుతోంది  
 
ఇక శాస్త్రీయంగా చూస్తే..వసంత కాలంలో వాతావరణంలో వేడి మొదలవుతుంది. దీంతో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తాయి. అందుకే కొన్ని  ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుతారు. తద్వారా వ్యాధుల వ్యాప్తి తగ్గుతాయంటారు ఆయుర్వేద నిపుణులు. మోదుగపువ్వుల్ని రాత్రిమొత్తం మరిగిస్తారు. అవి పసుపు రంగులోకి మారిన తర్వాత వాటిని చల్లుతారు. కానీ ప్రస్తుతం కృత్రిమ రంగులు వినియోగిస్తున్నారు..దీనివల్ల అనారోగ్యం తప్ప ఇంకే ప్రయోజనం ఉండదు.  
 
గమనిక:  కొన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది...దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..


(మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)