Ugadi Yearly Rasi Phalalu 2025: కొత్త ఏడాదిలో మిథున రాశివారికి అన్ని విధాలుగా అనుకూల సమయం. ఏడాది ఫలితాలు మొత్తం ఇక్కడ చూసుకోండి...
మిథున రాశి (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు మొదటి 3 పాదాలు )
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 4 అవమానం : 3
మిథున రాశివారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. మంచి ఆలోచనా శక్తి వీరి సొంతం. శక్తి సామర్థ్యాలకు మించిన పనులు చేస్తారు. ఎంత పెద్ద సమస్యను అయినా తెలివిగా పరిష్కరిస్తారు. వీరి సలహాలు ఇతరులకు మంచి చేస్తాయి. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ ఏడాది ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసొస్తాయి. కొత్త ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తారు.
కుటుంబ జీవితం,సంతానం కారణంగా ఉహించని కొన్ని సమస్యలు తప్పవు. దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం ఉంది. మత్తు పానీయాలపై ఆసక్తి పెరుగుతుంది. రహస్యంగా కొన్ని పాపపు పనులు చేస్తారు, ఇతరుల మేలుకోసం పాకులాడుతారు. చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించడం, మానసిక ప్రశాంతత పోగొట్టుకోవడం జరుగుతుంది.
మేష రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఉద్యోగులకు
శ్రీ విశ్వావసు నామసంవత్సరంలో మిథున రాశి ఉద్యోగులకు అన్నివిధాలుగా అనుకూల ఫలితాలే. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లతో కూడిన ఇంక్రిమెంట్స్ ,బదిలీలు ఉంటాయి. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. ఉద్యోగంలో ఓ స్థిరత్వం వస్తుంది.
రాజకీయ నాయకులు
రాజకీయ రంగంలో ఉండేవారికి శ్రీ విశ్వావసు నామసంవత్సరంలో ప్రజాదరణ పెరుగుతుంది. అధిష్టాన వర్గంతో స్నేహసంబంధాలుంటాయి. పదవికోసం ఎదురుచూస్తున్నవారికి నామినేటెడ్ పదవి దక్కుతుంది. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తారు. ఎన్నికల్లో పోటీచేసేవారు ఘనవిజయం సాధిస్తారు.
కళాకారులు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కళాకారులకు గురుబలం లేదు. గురుడు జన్మంలో ఉండడం వల్ల ఆశించిన ఫలితాలు ఉండవు. నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. మీకు రావాల్సిన అవార్డులు చివరినిముషంలో ఇతరులకు వెళతాయి. టీవీ, సినిమా రంగంవారికి ఈ ఏడాది గడ్డుకాలమే
వ్యాపారులు
మిథున రాశి వ్యాపారులకు ఈ ఏడాది యోగకాలమే. ఏ వ్యాపారం ప్రారంభించినా, ఎందులో పెట్టుబడి పెట్టినా శుభఫలితాలే ఉన్నాయి. నిర్మాణ రంగం, కాంట్రాక్టు వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు పొందుతారు.బంగారం, వెండి వ్యాపారులకు కలిసొస్తుంది.
విద్యార్థులు
మిథున రాశి విద్యార్థులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉహించిన ఫలితాలు రావు. విద్యాకారకుడు అయిన గురుడు జన్మస్థానంలో ఉన్నందున జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఉత్తీర్ణులవుతారు కానీ ఊహించినన్ని మార్కులు రావు. ప్రవేశ పరీక్షలలో మంచి మార్కులు, ర్యాంకులు రాకపోవడంతో కోరుకున్న కళాశాలలో సీటు పొందలేరు. విదేశాలకు వెళ్లాలి అనుకుంటే ఈ ఏడాది నిరాశే..
క్రీడాకారులకు కూడా గురుబలం లేనందుకు పెద్దగా కలసి రాదు. ఎంత కష్టపడినా విజయం సాధించే అవకాశాలు తక్కువ
వృషభ రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వ్యవసాయదారులు
ఈ ఏడాది మిథున రాశి వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి. అధిక దిగుబడి పొందుతారు. అప్పులు తీర్చేస్తారు. వాణిజ్య పంటలు, పండ్లతోటలవారికి లాభాలొస్తాయి. చేపలు , రొయ్యలు చెరువులు చేసేవారు కూడా నష్టపోరు.
స్త్రీలకు
మిథున రాశి స్త్రీలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అద్భుతంగా కలిసొస్తుంది. అనుకూల గ్రహసంచారం వల్ల మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగాలు చేసే మహిళలకు ప్రమోషన్ లభిస్తుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అవివాహితులకు ఈ ఏడాది వివాహం జరుగుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి మంచి పదవులు లభిస్తాయి. భార్య భర్త మధ్య ఉండే కలతలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి.
చిన్న చిన్న ఇబ్బందులు మినహా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశివారికి అన్ని విధాలుగా యోగకాలమే అని చెప్పుకోవాలి. సంతోషం, సుఖం, ఆదాయం, స్థిరత్వం, గౌరవం..అన్నీ మీ సొంతం...
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.