Janasena Formation Day: అధికారం లోకి వచ్చిన తర్వాత తొలిసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. జయ కేతనం పేరుతో జరగుతున్న ఈ ప్లీనరీలో పవన్ కళ్యాణ్ రెండు కీలక అంశాలు ఎజెండాగా ప్రసంగించబోతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, పార్టీ విస్తరణ.. ఈ రెండు అంశాలే ప్లీనరీకి ప్రధాన ఏజెండాగా మారాయి. పవన్ ప్రసంగం వీటిపైనే ఉండబోతుందని జనసేన వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
50 ఎకరాల ప్రాంగణం.. 1500మంది పోలీసులు.. లక్షల మంది జనసైనికులు..!
పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడ గ్రామంలో 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 'జయ కేతన' సభ జరగబోతుంది. ఇది జనసేనకు 12వ ఆవిర్భావ సభ. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీలు ఉదయ్, బాలశౌరి, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు,పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు లక్షల సంఖ్యలో తరలివచ్చేలా ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. వేదికపై పవన్ కల్యాణ్‌తోపాటు 250 మంది వరకు ఆసీనులయ్యేలా వేదిక సిద్ధం చేశారు. ఈ సభకు 'రావు సూర్యారావు బహుదూర్ మహారాజ్', 'డొక్కా సీతమ్మ,' "మల్లాడి సత్యలింగ నాయకర్ ' లాంటి సామాజిక వేత్తల పేర్లు మూడు ద్వారాలకు పెట్టారు.
తెలుగు సంస్కృతి చరిత్ర అద్దం పట్టేలా సభ నిర్వహిస్తామని ఇప్పటికే జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జనసేన భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై సభలో చర్చిస్తామని స్పష్టం చేశారు. లక్షల సంఖ్యలో తరలివచ్చే ఈ జనసేన ఆవిర్భావ సభకు 1500కుపైగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చే జనసైనికుల బాధ్యతలను ఆయా జిల్లాల ఇన్చార్జ్‌లకు అప్పచెప్పారు.
ప్రధాన ఎజెండాలు ఇవే
11 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అధికారంలోకి జనసేన భవిష్యత్తు ప్రణాళికలుగా సనాతన ధర్మ పరిరక్షణ, పార్టీ విస్తరణను ఈ వేదికపై నుంచి పవన్ కళ్యాణ్ ప్రకటించబోతున్నారు. ఏపీ అనే కాకుండా తెలంగాణ తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల్లోనూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ పలు యాత్రలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో వీటిని మరింత తీవ్రతరం చేయబోతున్నారు. దేశ వ్యాప్తంగా పర్యటించి సనాతన ధర్మపరిరక్షణ కోసం జనసేన ఎలా కట్టుబడి ఉందో ప్రకటించబోతున్నారు. ఇతర మతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేలా పవన్ ప్రసంగం సాగబోతోంది. దానితోపాటు జనసేన పార్టీని తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరించేలా ఎలా బలోపేతం చేయాలనే దానిపైనా కేడర్‌కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇతర పార్టీ నాయకులు జనసేన వైపు రావాలనుకుంటే వారికి ఆహ్వానం పలుకుతూనే దానికి వారు ఎలాంటి నియమాలు పాటించాలనే దానిపైనా ఒక స్పష్టత ఇవ్వబోతున్నారు.
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ప్రస్తుతానికి ఈ రెండు ఎజెండాలతోటే ' జయకేతన' సభ నడవబోతోంది. పిఠాపురం నియోజకవర్గ మొత్తం పవన్ గారి తాలూకా మారిపోయిన నేపథ్యంలో అక్కడ తొలిసారి జరుగుతున్న ప్లీనరీ సూపర్ సక్సెస్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు జనసేన నిర్వాహకులు. అయితే సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మొదలయ్యేసరికి మాత్రం సాయంత్రం అయిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతోంది.