Tirumala Bramhosthavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకం
సాక్షాత్తు బ్రహ్మదేవుడు జరిపించిన ఉత్సవాలు...అందుకే బ్రహ్మోత్సవాలు అంటారు. శ్రీవేంకటేశ్వరుడు ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా ఉత్సవాలు నిర్వహించాలని స‌్వామివారు స్వయంగా బ్రహ్మదేవుడికి చెప్పారు.
అంకురార్పణ (03-09-2024)
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ప్రారంభించిన ఉత్సవం విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణ నిర్వహిస్తారు. శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంతమండపానికి ఊరేగింపుగా వెళతారు. అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నవధాన్యాలు పాలికలలో వేస్తారు. అంకురాలను ఆరోపించే కార్యక్రమం ఇది..అందుకే అంకురార్పణం.
ధ్వజారోహణం(04-10-2024)(సాయంత్రం 5.45 నుండి 6 గంటల వరకు)
ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను ఆహ్వానిస్తారు.
Also Read: ఏడు కొండలవాడి సన్నిధికి ఏడు నడకదారులు - ఏ దారి ఎక్కడి నుంచి!
పెద్దశేషవాహనం(04-10-2024)(రాత్రి 9 గంటలకు)
మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. ఆదిశేషుడు .. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడిగా స్వామివెంటే ఉన్నాడు. శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం.
చిన్నశేషవాహనం(05-10-2024)(ఉదయం 8 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై విహరిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది.
హంస వాహనం(05-10-2024)(రాత్రి 6 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామి హంసవాహనంపై విహరిస్తారు. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. ఈ అవతారంలో స్వామిని దర్శించుకుంటే అహంభావం తొలగిపోతుంది.
Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
సింహ వాహనం(06-10-2024)(ఉదయం 8 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. యోగశాస్త్రంలో సింహం బలానికి, వేగానికి నిదర్శనం.
ముత్యపుపందిరి వాహనం(06-10-2024)(రాత్రి 7 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామి ముత్యపుపందిరి వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించేవాడు. ఈ వాహన దర్శన సకల శుభాలను ఇస్తుంది.
కల్పవృక్ష వాహనం(07-10-2024)(ఉదయం 8 గంటలకు)
4వ రోజు ఉదయం స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది.
సర్వభూపాల వాహన వైశిష్ట్యం(07-10-2024)(రాత్రి 7 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై విహరిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. అష్ట దిక్పాలకుల పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్నిస్తుంది ఈ వాహన సేవ.
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
మోహినీ అవతారం (08-10-2024)(ఉదయం 8 గంటలకు)
బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో భక్తులకు దర్శనమిస్తారు . ఆ పక్కనే కన్నయ్య రూపంలోనూ అనుగ్రహిస్తారు. మాయావిలాసం అయిన ప్రపంచంలో భక్తులు ఆ మాయను సులభంగా దాటగలరని ఈ వాహన సేవ ఆంతర్యం.
గరుడ వాహనం(08-10-2024)(సాయంత్రం 6.30 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో విహరిస్తారు స్వామివారు. 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహన సేవ ఆంతర్యం.
హనుమంత వాహనం(09-10-2024)(ఉదయం 8 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు. హనుమంతుడు భక్తులలో అగ్రగణ్యుడు.
స్వర్ణరథం(09-20-2024)(సాయంత్రం 4 గంటలకు)
6వ రోజు సాయంత్రం శ్రీవారు స్వర్ణరథంపై ఊరేగుతారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని చూసిన భక్తులకు ఎలాంటి అనుభూతి కలిగిందో శ్రీనివాసుడిని స్వర్ణరథంపై చూసిన భక్తులకు అదే సంతోషం కలుగుతుంది.
గజవాహనం(09-10-2024)(రాత్రి 7 గంటలకు)
6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు అభయమిస్తారు శ్రీవారు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలన్నదే ఈ వాహన సేవ ఆంతర్యం.
సూర్యప్రభ వాహనం(10-10-2024)(ఉదయం 8 గంటలకు)
7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధులలో విహరిస్తారు స్వామివారు. ఈ వాహనంపై విహరించే శ్రీవారి దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి.
చంద్రప్రభ వాహనం(10-10-2024)(రాత్రి 7 గంటలకు)
బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు స్వామివారు. ఈ వాహన సేవ దర్శించుకున్న భక్తుల మనసు పులకించిపోతుంది. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హ దయాల నుండి అనందరసం స్రవిస్తుంది
Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి!
శ్రీవారి రథోత్సవం(11-10-2024)(ఉదయం 7 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మ, శరీరం, ఇంద్రియాలను రథం, గుర్రాలు, మాడ వీధులతో పోల్చుతారు. రథోత్సవం వల్ల తత్త్వజ్ఞానం కలుగుతుంది.
అశ్వవాహనం(11-10-2024)(రాత్రి 7 గంటలకు)
8వ రోజు రాత్రి స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తారు. కల్కి అవతారంతో అశ్వవాహనారూఢుడై భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని ఈ వాహన సేవ ద్వారా తెలియజేస్తున్నాడు.
చక్రస్నానం(12-10-2024)(ఉదయం 6 నుంచి 9 గంటల వరకు)
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన 9వ రోజు ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో పుష్కరిణిలో స్నానమాచరించేందుకు భక్తులు పోటెత్తుతారు.
ధ్వజావరోహణం(12-10-2024)(రాత్రి 8.30 గంటలకు)
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తర్వాత ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.