జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం మాన‌వుడి జీవితాన్ని న‌వ‌గ్రహాలు ప్ర‌భావితం చేస్తున్నా అందులో శ‌నీశ్వ‌రుడి ప్ర‌భావం చాలా తీవ్ర‌మైన‌ది అని చెప్ప‌వ‌చ్చు. మన‌కు ఎదుర‌య్యే క‌ష్ట సుఖాలకు, వారి వారి క‌ర్మ‌ల అనుసారంగా ఫ‌లితాన్ని ప్ర‌సాదించేది ఆయ‌నే. సూర్యుని కుమారుడిగా, క‌ర్మ‌ఫ‌ల‌దాత‌గా పిలిచే శ‌నిదేవుడు ధ‌ర్మానుసారం ఫ‌లితాల‌ను అందిస్తాడు. శని ప్ర‌భావం ఎంత‌లా ఉంటుందంటే ఆయ‌న చూపు ప‌డితే చాలు బికారి రాజు కాగ‌ల‌డు, రాజు బికారి కాగ‌ల‌డు. అంత‌లా మాన‌వ జీవితాన్ని ప్ర‌భావితం  చేసే శ‌నీశ్వ‌రుడిని గురించి మ‌న‌లో చాలా మంది భ‌య‌ప‌డుతుంటాం. నామాన్ని ఉచ్ఛరించడానికి సైతం వెనకాడతాం. ఆయనకు ఆగ్రహం కలిగే పనుల్ని చేయరాదని తీర్మానించుకుంటాం.


Also Read: రాశిమారుతున్న కుజుడు ఈ ఆరు రాశులవారికి అన్నీ శుభఫలితాలే!


అయితే శ‌నీశ్వ‌రుడి పూజ ఆయ‌న‌కు అమిత‌మైన ఆనందాన్ని క‌లిగిస్తుంది. స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుంది. జాతక రీత్యా శనిదోషంతో బాధపడేవారు, శని దశ అంతర్దశలు నడుస్తున్నవారు, ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని లాంటివాటి వలన ఎవరైతే బాధ‌బడుతున్నారో అటువంటివారు శ‌ని త్ర‌యోద‌శి రోజున కానీ, శ‌నివారంనాడు కానీ శ‌నిదోశ ప‌రిహారాలు చేసుకుంటారో వారికి వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు తొలిగిపోతాయి. మ‌రి శ‌నీశ్వ‌రుడి కృప‌కు పాత్రులు కావాలంటే ఎటువంటి ప‌రిహారాలు  చేయ‌వ‌చ్చో తెలుసుకోండి!!



  • వారంలో ఏడ‌వ‌రోజు అంటే శ‌నివారం అంటే శ‌నీశ్వ‌రుడికి ప్రీతిక‌ర‌మైన‌ది. ఇక శ‌నివారం త్ర‌యోద‌శి తిథితో క‌లిసి ఉన్న‌దైతే అది అత్యంత శుభ‌క‌రం. ఆ రోజు శ‌నీశ్వ‌రుడుకి అత్యంత ప్రీతిక‌రం. ఆరోజున ప్ర‌దోశ కాలంలో చేసే శివార్చ‌న‌, శ‌నైశ్వ‌రార్చ‌న చాలామంచి శుభ‌ఫ‌లితాల‌ను ఇస్తుంది.

  • శ‌ని బాధలు తీవ్రంగా ఉన్నవారు... ప్ర‌తీ శ‌నివారం ఇనుప గిన్నెలో, నువ్వుల నూనె వేసి దానిలో మీ ముఖాన్ని చూసి, ఆ నూనెను శ‌నిదేవుడి గుడిలో కానీ, న‌వ‌గ్ర‌హాలు ఉన్న గుడిలో కానీ ఇవ్వాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తీ శ‌నివారం చేస్తే కొద్దిరోజుల‌లోనే శ‌నిగ్ర‌హ‌బాధ‌ల నుంచి విముక్తిని పొంద‌వ‌చ్చు.

  • ప్ర‌తీ శ‌నివారం రోజున నూనెతో చేసిన చ‌పాతీల‌ను న‌ల్ల‌కుక్క‌కు తినిపించాలి. ఇలాంటివి చిన్న చిన్న ప‌నుల‌ను చేయ‌డం వ‌ల్ల శ‌నీశ్వ‌రుడి బాధ‌ల‌నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

  • శ‌నివారం రోజున ఒక కిలో న‌ల్ల నువ్వులు, న‌వ ధాన్యాలు, ఇనుప వ‌స్తువు, న‌ల్ల‌ని గొడుగు, నువ్వుల నూనె లాంటివి దానం చేయ‌డం వ‌ల్ల శ‌నిగ్ర‌హ బాధ‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

  • శ‌నిగ్ర‌హ బాధ‌లు ఎక్కువ‌గా ఉన్న‌ట్ల‌యితే ఆ వ్య‌క్తి ప్ర‌తి శ‌నివారం ఒక వ్ర‌త‌నియ‌మాన్ని పాటించాలి. ముందుగా శ‌నీశ్వ‌రుడికి తైలంతో అభిషేకం చేసి, పూజ చేసి...ఓం ప్రాం ప్రీం సః శ‌నైశ్చ‌రాయ న‌మః అనే మంత్రాన్ని108 సార్లుగానీ లేదా  య‌థాశ‌క్తిగా  క‌నీసం 21 కి త‌గ్గ‌కుండా జ‌పం చేయాలి. ఆ తర్వాత శ‌ని చాలీసా చ‌దివి, హార‌తి ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజున పేద‌వారికి స‌హాయం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తొంద‌ర‌గానే శ‌నీశ్వ‌రుడి బాధ‌ల‌నుంచి విముక్తి పొంద‌గ‌ల‌రు.

  • ప్ర‌తి శ‌నివారం రోజున ఉద‌యం, సాయంత్రం రావిచెట్టుకు ప్ర‌ద‌క్ష‌ణాలు చేయ‌డం వ‌ల్ల శ‌నిగ్ర‌హ బాధ‌లు తొలుగుతాయి. అంతేకాదు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. అప్పుల బాధ‌లు తీరుతాయి. రావిచెట్టు సాక్షాత్తూ శ్రీకృష్ణుడి స్వ‌రూపం. శ‌నిదేవుడు కృష్ణుడికి ప‌ర‌మ‌ భ‌క్తుడు. అందువ‌ల్ల ఆ చెట్టును ఆరాధిస్తే ఆయ‌న మ‌న‌ప‌ట్ల‌ ప్ర‌స‌న్నుడ‌వుతాడు.

  • హ‌నుమంతుడి పూజ చేస్తున్న వారిని శ‌నీశ్వ‌రుడు బాధించ‌డు. అందుకోసం శ‌నీశ్వ‌రుడి పూజ మాత్ర‌మే కాదు హ‌నుమంతుడి పూజ కూడా చేస్తే శ‌ని పెట్టే బాధ‌ల‌నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

  • హ‌నుమాన్ చాలీసా, సుంద‌రాకాండ పారాయ‌ణం లాంటివి చ‌ద‌వ‌డం వ‌ల్ల అటు హ‌నుమంతుడు, ఇటు శ‌నీశ్వ‌రుడు ఇద్ద‌రి కృప‌కు పాత్రులుకాగ‌లం.


Also Read: అక్టోబరు 16 న మిథునంలోకి కుజుడు, ఈ రాశులవారికి నెలరోజుల పాటు కష్టాలు తప్పవు!