Amit Shah's Residence:


గార్డ్ రూమ్ వద్ద పాము..


కేంద్రహోం మంత్రి అమిత్‌షా నివాసంలో ఓ ఐదడుగుల పాము భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టించింది. ఇది ఆసియాటిక్ వాటర్ స్నేక్‌ గా గుర్తించారు. వెంటనే వన్యప్రాణి సంరక్షణా అధికారులకు సమాచారం అందించారు. ఓ స్వచ్చంద సంస్థకు చెందిన సిబ్బంది ఆ పాముని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. సెక్యూరిటీ గార్డ్ రూమ్ వద్ద ఈ పాముని గుర్తించారు. ఇది విషం లేని పాము అని అధికారులు తెలిపారు. "ఢిల్లీలోని అమిత్‌షా ఇంట్లో పాముని చూసి అక్కడి భద్రతా సిబ్బంది షాక్ అయింది. గార్డ్‌ రూమ్ వద్ద అది కనిపించింది. వాళ్లు వెంటనే అప్రమత్తమయ్యారు. వన్యప్రాణి సంరక్షణా అధికారులకు సమాచారం అందిచారు. 9871963535 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేశారు. వెంటనే ఇద్దరు వచ్చి చాలా సురక్షితంగా పాముని పట్టుకున్నారు" అని అధికారులు వెల్లడించారు. 


షూలో దూరింది..


పాములు ఎప్పుడు వచ్చి ఇళ్లలో దూరుతాయో ఎవరూ కనిపెట్టలేరు. చిన్న సందు దొరికినా వచ్చేస్తాయి. ఎక్కడో దాక్కుంటాయి. ఇల్లు సర్దుతుంటేనో, అనుకోకుండానో అవి మన కంట పడతాయి. కర్ణాటకలోని మైసూరులోనూ ఇదే జరిగింది. వెచ్చగా ఉందనకుందేమో..ఓ కోబ్రా షూలో దాక్కుంది. పాములు పట్టుకునే వ్యక్తి వచ్చి దాన్ని బయటకు తీసేందుకు చాలానే కష్టపడ్డాడు. స్నేక్ హుక్‌తో షూని అలా టచ్ చేశాడో లేదో..వెంటనే పడగ విప్పి బుస కొట్టింది కోబ్రా. ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా...వైరల్ అయింది. షూ వేసుకునేందుకు చూసిన వ్యక్తి...లోపల పాముని చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కి కాల్ చేసి విషయం చెప్పాడు. ఆ వ్యక్తి వచ్చి షూలో నుంచి పాముని బయటకు తీశాడు. ఇలా షూలో పాము దాక్కుని అందరినీ హడలెత్తించటం ఇదే తొలిసారి కాదు. 






చెప్పుల స్టాండులో..


తన చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చిన ఓ మహిళకు అందులో లోపల నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి షాక్‌కు గురైంది. వెంటనే ఓ ఇనుప రాడ్‌ను షూ లోపల నెట్టడంతో నాగుపాము పడగ విప్పి మహిళను కాటు వేసేందుకు ప్రయత్నించింది. చివరికి ఎలాగోలా ఆ పామును బయటకు పంపారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద షూలో పడుకున్న నాగుపాము వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.  క్యాప్షన్‌లో వర్షాకాలంలో పలు ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. షూలోపల నాగుపాము పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు తమ జీవితంలో పామును చూసిన ఘటనల గురించి కామెంట్లు పెడుతున్నారు. వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రెండు రైలు పట్టాలు కలిసే పాయింట్లో పాము దూరడంతో ఇటీవల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన తెల్లవారుజామున పుత్తూరు రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది.