Federal Bank Q2 Results: ప్రైవేట్ రంగ రుణదాత ఫెడరల్ బ్యాంక్, ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల త్రైమాసికానికి సంబంధించి హెల్దీ నంబర్లను పోస్ట్ చేసింది. బ్యాంక్ స్వతంత్ర (స్టాండ్‌లోన్) నికర లాభం 50 శాతానికి పైగా పెరిగింది. దీని కంటే ఆకట్టుకున్న అంశం.. బ్యాంక్ మొండి బకాయిలు, కేటాయింపులు తగ్గడం.
2022-23 ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు కాలంలో (రెండో త్రైమాసికం) ఫెడరల్ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.4,060.75 కోట్ల నుంచి రూ.4, 886.58 కోట్లకు చేరింది.
నికర లాభం 53% జంప్
ఏకీకృత ప్రాతిపదికన.. రూ. 733.34 కోట్ల నికర లాభాన్ని ఈ బ్యాంక్ సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలోని ఏకీకృత నికర లాభం రూ. 485.72 కోట్లతో పోలిస్తే ఇది 50 శాతం పైగా వృద్ధి. వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయాలు పెరగడం ఇందుకు కారణం. స్వతంత్ర ప్రాతిపదికన చూస్తే.. నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 460.26 కోట్ల నుంచి 52.89 శాతం వృద్ధితో రూ. 703.71 కోట్లకు చేరింది.
వడ్డీ ఆదాయం
బ్యాంక్ ఇచ్చిన అప్పుల మీద వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం 19.1 శాతం పెరిగి రూ. 1,762 కోట్లకు చేరింది.
మెరుగుపడిన అసెట్ క్వాలిటీ
ఆస్తుల నాణ్యత విషయానికి వస్తే... ఏడాది ప్రాతిపదికన (YoY) స్థూల నిరర్థక ఆస్తులు లేదా మొండి బకాయిలు (Gross NPAs) 3.24 శాతం నుంచి 2.46 శాతానికి తగ్గాయి. రూపాయల పరంగా చూస్తే.. స్థూల NPAలు రూ.4,445.84 కోట్ల నుంచి రూ.4,031.06 కోట్లకు తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తులు (Net NPAs) 1.12 శాతం నుంచి 0.78 శాతం తగ్గాయి. వీటిని కూడా రూపాయల్లో చూస్తే.. రూ.1,502.44 కోట్ల నుంచి రూ.1,262.35 కోట్లకు దిగి వచ్చాయి. ఈ తగ్గుదల కొద్దిగానే కనిపించినా, భవిష్యత్ దృష్ట్యా దీనిని మంచి సూచనగా తీసుకోవచ్చు.
తగ్గిన కేటాయింపులు
మొండి బకాయిలు, ఆకస్మిక వ్యయాలకు (Contingencies) రక్షణగా చేసే కేటాయింపులు (Provisions ) కూడా రూ. 292.62 కోట్ల నుంచి రూ. 267.86 కోట్లకు తగ్గాయి. అంటే, బ్యాడ్ లోన్ల భయం తగ్గింది.
షేరు ధర
BSEలో, శుక్రవారం 4.37 శాతం పెరిగిన ఫెడరల్ బ్యాంక్ స్క్రిప్ రూ.130.25 వద్ద సెటిలైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.