Tirumala News: నిత్యం కళ్యాణం, పచ్చ తోరణం అన్నట్టుండే తిరుమలలో నిత్యం విశేష విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. వివిధ అలంకారాల్లో భక్తకోటికి దర్శనమిస్తారు స్వామివారు. సాధారణంగా శివుడిని అభిషేక ప్రియుడని...విష్ణువుని అలంకార ప్రియుడని పిలుస్తారు. ఇందుకు నిదర్శనం శ్రీవేంకటేశ్వరస్వామి.
పురాణాల ప్రకారం... శ్రీరంగం భోగమండపం, కంచి త్యాగ మండపం, తిరుమల పుష్ప మండపం అని చెబుతారు. పుష్పమండపం పేరుకి తగ్గట్టే శ్రీవారు పుష్పాలంకప్రియుడు. అందుకే శ్రీవేంకటేశ్వరస్వామి సేవకోసం నిత్యం టన్నుల కొద్దీ పూలను వినియోగిస్తుంటారు. కానీ కొండపై దర్శనానికి వెళ్లే భక్తులు మాత్రం తలలో పూలు పెట్టుకోకూడదని చెబుతారు. పూలు పెట్టుకున్నావానిని దర్శనానికి కూడా అనుమతించరు. తిరుమలలో పూసే ప్రతిపూవూ స్వామివారి సేవకోసమే..
Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
తిరుమలలో పూసే ప్రతి పూవూ శ్రీవారి అలంకరణకోసమే కానీ భక్తుల పుష్పాలంకరణ కోసం కాదు అనే నియమం ఎప్పటి నుంచో ఉంది.
తిరుమలకు పుష్పమండపం అనే పేరుంది.. ఇక్కడ ఎన్నో రకాల పూలు పూస్తాయి..అవన్నీ స్వామి సన్నిధికే చేరుకుని తరిస్తాయి..
తిరుమలలో పూలెందుకు పెట్టుకోకూడదో వివరిస్తూ ఓ కథనం ప్రచారంలో ఉంది. అప్పట్లో శ్రీవారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఓసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి దగ్గరుండే శిష్యుడు..స్వామికి అలంకరించాల్సిన పూలను తాను అలంకరించుకుని ఆనందించాడు.
ఆ రోజు రాత్రి శ్రీశైల పూర్ణుడి కలలో కనిపించిన శ్రీ వేంకటేశ్వరుడు ... నీ శిష్యుడు పరిమళద్రోహం చేశాడని చెప్పాడు. అది తెలిసినప్పటి నుంచీ శ్రీశైల పూర్ణుడు చాలా బాధపడ్డాడు. ఆ బాధనుంచి తీసుకున్న నిర్ణయమే ఇది...ఆ రోజు నుంచి స్వామివారికి అలంకరించిన పూలను కూడా భక్తులకు ఇవ్వొద్దని భావించి వాటిని తీసుకెళ్లి పూలబావిలో వేయడం ప్రారంభించారు. ఈ పూలతోనే అగరొత్తులు తయారు చేస్తారు...
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
స్వామివారి అలంకరణ సేవలో వినియోగించే పూలమాలలకు కొన్ని పేర్లున్నాయి...
శ్రీవారి పాదాలపై అలంకరించే మాలను తిరువడి దండలు అంటారు
కిరీటం మీదుగా భుజాల వరకు అలంకరించే పూలమాలలను శిఖామణి అని పిలుస్తారు
భుజాల నుంచి ఇరువైపులా పాదాలవరకు వ్రేలాడుతున్నట్టుండే మాలలను సాలగ్రామమాల అంటారు
శ్రీ వేంకటేశ్వరుడి మెడలో అలంకరించే పుష్పహారాన్ని కంఠంసరి అంటారు
నందకం అనే ఖడ్గానికి అలంకరించే పుష్పమాలికను కఠారిసరం అని పిలుస్తారు
మోచేతులు కింద నుంచి పాదాల వరకూ వేలాడే మాలలను తావళములు అంటారు
శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవులకు , శంఖచక్రాలకు మాలలు అలంకరిస్తారు
Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి!
అలంకరణ శోభితుడైన ఏడుకొండలవాడిముందు మన అలంకరణ ఏ పాటిది.. భగవంతుడి ఎదుట భక్తులంతా సమానంగా, సాధారణంగా ఉండాలన్నదే ఈ నియమాల వెనుకున్న ఆంతర్యం. సప్తగిరులపై పూలు పెట్టుకోకూడదు అనే నియమం కూడా ఈ కోవకే చెందుతుంది.
ఆలయ దర్శనాలకు వెళ్లినప్పుడు ఆడంబాలకుపోకుండా సంప్రదాయదుస్తుల్లో సాధారణ భక్తుడిగా వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. అప్పుడే శ్రీ వేంకటేశ్వరుడిపై ఏకాగ్రత కుదురుతుంది..స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు.