అంజనీసుతుడు, పురాణ పురుషుడుగానే కాకుండా పరిపూర్ణ సాకారమూర్తిగా, ఆదర్శప్రాయుడుగా నిత్య ఆరాధ్యనీయుడు ఆంజనేయుడు. స్వామి కార్యం కోసం శక్తియుక్తులు ధారపోయాలని, అహం దరిచేరనీయని సంకల్ప బలం ఉండాలని,నిరంతరం శ్రమించాలన్నదే హనుమంతుడి సందేశం. లక్ష్యసాధనకు పట్టుదల, శారీరక బలం మాత్రమే సరిపోదు..సమయానుకూలంగా బుద్ధి కుశలత ఉండాలి, అవసరమైన శక్తియుక్తులు ప్రదర్శించాలి. ఇంకా చెప్పాలంటే ఎక్కడ తగ్గాలో , ఎక్కడ నెగ్గాలో తెలియాలి. భయాన్ని విడిచిపెట్టాలి, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియాలి..ఇవన్నీ కలగలపిన వ్యక్తిత్వ వికాసం ఆంజనేయుడు. అందుకే ఆంజనేయుడిని పురాణ పురుషుడిగా కాదు వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా చూడాలని చెబుతారు రామకృష్ణ పరమహంస, వివేకానంద. 


Also Read:  మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది


వైశాఖ మాసం బహుళ పక్షం దశమి రోజు రుద్రాంశతో హనుమంతుడు జన్మించాడని పరాశర సంహిత, ఆయన శిష్ట రక్షకుడు.. దుష్ట శిక్షకుడని నారద పురాణం తెలిపాయి. త్రిపురాసుర సంహార సమయంలో శ్రీహరి తనకు అందించిన సహకారానికి కృతజ్ఞతగా సాక్షాత్తూ శివుడే హనుమంతుడిగా ఆవిర్భవించాడని వానరగీత పేర్కొంది. ఆరు కాండలతో విరాజిల్లే శ్రీమద్రామాయణ మహాకావ్యంలో ఐదవ కాండ  అయిన సుందరకాండ ఆంజనేయుడి వీరత్వానికి, సాహస కృత్యాలకు, భక్తి వైభవానికి నెలవు. శ్రీరామచంద్రుడిని కలసిన క్షణం నుంచి సీతమ్మ జాడ తెలుసుకోవడం,అమ్మవారి ఆచూకీని తిరిగి స్వామివారికి చేరవేసేవరకూ ఎదురైన ఇబ్బందులను అధిగమించే సందర్భాల్లో హనుమంతుడి స్వామిభక్తి, అంకితభావం, ధర్మనిరతి వ్యక్తమవుతుంది. సుందరకాండ రామాయణానికే తలమానికం. రామభక్తుడైన ఆంజనేయుని విజయ పరాక్రమాలు ఆహ్లాదకరంగా వర్ణితం కావడంతో ఈ ‘కాండ’ సౌందర్యానికి మారుపేరుగా నిలిచిందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. 


Also Read: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా


సీతాన్వేషణకు తమ్ముడితో బయలుదేరిన రాముడికి కిష్కింధలో మారువేషంలో అంజనీపుత్రుడు కనిపించగా, ‘సోదరా! ఇతడు నవవ్యాకరణాలనూ చదివిన జ్ఞానసంపన్నుడు,సాక్షాత్తూ సరస్వతీ స్వరూపుడు, సీతాన్వేషణ కార్యాన్ని నెరవేర్చగల సమర్థుడు’ అని హనుమలోని విశిష్ట లక్షణాలను వివరించాడు రామ చంద్రుడు. అయితే నవమ బ్రహ్మ పదవి కంటే ‘రామబంటు’గా ఉండేందుకే ఇష్టపడతానంటాడు హనుమంతుడు అందుకే...‘యత్రయత్ర రఘునాథ కీర్తనమ్‌/తత్రతత్ర కృతమస్తకాంజలిమ్‌’ రామనామం వినిపించినచోటల్లా అంజలి ఘటించి నిలుచుండిపోతాడు హనుమంతుడు. ‘జై శ్రీరామ్‌’ అనే మాట వినిపిస్తే రాముడి కన్నా ముందే తన తేజస్సుని అక్కడి ప్రసరింపచేసి కార్యోన్ముఖుడైపోతాడట హనుమంతుడు.  అందుకు శ్రీరామచంద్రుడు లాంటి ప్రభువు- ఆంజనేయుడు లాంటి బంటు లేడంటారు. ఆంజనేయుడు లాంటి బంటు లభించడం తన అదృష్టంగా రామచంద్రుడే కొని యాడాడని తులసీదాస్‌ కీర్తించారు.


ఆంజనేయుడి నుంచి నేర్చుకోవాల్సినవి ఇవే



  • ‘దీక్ష, మనోనిగ్రహం, ధైర్యం, వినయం, త్యాగం, ఆత్మవిశ్వాసం, అంకితభావం, మనోబలం, బుద్ధి కుశలత, కార్యసాఫల్యానికి ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు సంపూర్ణంగా ఉన్న హనుమంతుడిని యువత ఆదర్శంగా తీసుకుని జీవితాలను తీర్చిదిద్దుకోవాలి’ అన్నారు స్వామి వివేకానంద.

  • ఆత్మ విశ్వాసం విజయానికి తొలిమెట్టు అనే సూత్రాన్ని హనుమ అక్షరాల పాటించాడు. ఎందుకంటే సీతాన్వేషణకు లంకకు వెళుతున్న తాను ఎప్పటికి తిరిగా రాగలనో చెప్పలేను కానీ, సీతమ్మ జాడను తెలుసుకుని వస్తానని చెప్పి వెళ్లాడు.

  • సీతాన్వేషణకు సముద్రాన్ని దాటుతున్నప్పుడు సాగరగర్భం నుంచి పైకి వచ్చి మైనాకుడు ఇస్తానన్న ఆతిథ్యాన్ని మృదువుగా తిరస్కరించి ముందు స్వామికార్యం అని చెప్పి ముందుకు సాగడంలో పనిపట్ల అంకిత భావం కనపిస్తుంది

  • సీతామాత ఆచూకీ దొరక్కపోతే ఆత్మహత్యే శరణ్యం అని భావించి అంతలో మనోబలంతో తనకు తానే ధైర్యం చెప్పుకుని పట్టుదలతో ప్రయత్నం సాగించాడు

  • తాను సాధించిన కార్యాలు తన ఘనతగా కాకుండా వానర సమూహ విజయంగా అభివర్ణించిన మహోన్నతుడు

  • జ్ఞానుల్లో అగ్రగణ్యుడు, సకల గుణనిధుడు అయినప్పటికీ పెద్దల ముందు వినయశీలి హనుమంతుడు 


Also Read:  హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!