Karimnagar Government Teacher: అతనొక విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యతగల టీచర్. మరోవైపు, కీలకమైన ఎస్ఎస్సీ పరీక్షల్లో ఇన్విజిలేషన్ బాధ్యతలు చూసుకోవాల్సిన డ్యూటీ. అలాంటి అతను ఏకంగా అదే ఎగ్జామ్ సెంటర్ కి పూటుగా మద్యం తాగి వచ్చి తన బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించాడు. సెంటర్ లోనే తూలుతూ కనిపించాడు.


హుజురాబాద్ లోని  (Huzurabad News) రాంపూర్ లో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఆముల రవికుమార్ డ్యూటీలో ఉండగా మొదట ఎగ్జామ్ కి వచ్చిన విద్యార్థులకు అనుమానం వచ్చింది. తన ప్రవర్తన కొంత అనుమానాస్పదంగా అనిపించింది. ఇదే విషయంపై ఇన్స్పెక్షన్ విధులకు వచ్చిన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావుకి కూడా అనుమానం వచ్చింది. దీంతో సదరు టీచర్ని ప్రశ్నించగా గుప్పున వాసన వచ్చింది. ఇక వెంటనే స్థానిక పోలీసులను పిలిపించి సదరు టీచర్ కి ఎగ్జామ్స్ సెంటర్ లోనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. మామూలుగా 30 ఉండాల్సిన మద్యం స్థాయిలు ఏకంగా 112 చూపించాయి. ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించిన ముఖ్యమైన ఎగ్జామ్స్ జరుగుతుంటే సదరు టీచర్ మాత్రం నిర్లక్ష్యంగా మందు తాగి మరి ఎగ్జామ్ కి అటెండ్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత విద్య అధికారులు వెంటనే అతణ్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 


మరోవైపు, ఇదే అంశంపై జిల్లా విద్యాధికారి సీహెచ్‌వీఎం జనార్దన్ రావు మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహించే ఎవరినైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సదరు ఉపాధ్యాయుడికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించి అతనితో పాటు సెంటర్ సూపరిండెంట్ ని సైతం నిర్లక్ష్య ధోరణి కారణంగా విధుల్లో నుంచి తొలగించడం జరిగిందని తెలిపారు.


ఇక మరోవైపు జిల్లావ్యాప్తంగా దాదాపు 12,742 విద్యార్థినీ విద్యార్థులకు గాను 12,668 మంది విద్యార్థులు రెండో రోజు పరీక్షకు హాజరయ్యారు. ఎక్కడికక్కడ ఫ్లైయింగ్ స్క్వాడ్ తో పాటు ఇతర ఇన్స్పెక్షన్ బృందాలు 29 సెంటర్ లలోనూ పరీక్షల విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించడం లేదని వారు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా వీలైనంత ముందుగానే తమ పిల్లలను సెంటర్ వద్ద వదిలి వెళ్లాలని.. ఇక ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కైనా పాల్పడితే వారిని పరీక్షలు రాయకుండా డిబార్ చేయడమే కాకుండా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇతర శాఖలకు చెందిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ మొత్తం పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.