కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మానేర్ డ్యామ్‌కి మరో కొత్త ఫీచర్ యాడ్ కానుంది. గత రెండు రోజులుగా ప్రయోగాత్మకంగా ఏయిర్ షో నిర్వహించారు. ప్యారాచూట్ విన్యాసాలకు ఈప్రాంతం అనువుగా ఉందా… లేదా అని పరిశీలించిన పైలెట్ సుకుమార్ ఇప్పటికే దీనికి సమ్మతి తెలిపారు.


కరీంనగర్‌లో విహంగ వీక్షణం


ఇక మానేరు అందాలతోపాటు కేబుల్ బ్రిడ్జ్, కరీంనగర్ టౌన్‌ని ఆకాశం నుంచి చూసే విధంగా ఏయిర్ షోలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఇలాంటి అవకాశం ఇప్పటి వరకు ముంబై, వైజాగ్, గోవా లాంటి పర్యాటక ప్రదేశాల్లో మాత్రమే కనిపించేది. ఇక దీనికి సంబంధించి తెలంగాణ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో చర్చించి కావల్సిన అనుమతులు కోరినట్లు తెలిసింది.


తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నగర సమీపంలోనే జలాశయం ఉండటంతో నీటిపై సాహస క్రీడలతోపాటు గాలిలో విన్యాసాలు నిర్వహించాలన్న ప్రధాన లక్ష్యంతో వర్టికల్ వరల్డ్ ఏరో స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఈ సాహస క్రీడ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న సాహస క్రీడ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


మానేరుపై స్పెషల్ ఫోకస్ 


ఇప్పటికే మానేరు నదిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పనులు చేపట్టింది. ఈ ప్రాజెక్టును మార్చి 17న తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే చెక్‌ డ్యాంల నిర్మాణం నదికి ఇరువైపులా రిటైనింగ్‌ వాల్స్‌ పనులు చకచకా సాగుతున్నాయి. గత రెండు నెలలుగా బేస్‌మెంట్‌ పనులు చేపట్టారు. 


రూ. 410 కోట్లతో పనులు





కరీంనగర్‌లోని మానేరు నదిపై రూ.410 కోట్లతో మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. మొదటి విడతలో ఎల్‌ఎండీ డ్యాం నుంచి నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మిస్తున్నారు. దీనికి రూ.310.46 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం అల్గునూర్‌, సదాశివపల్లివైపుగా రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణానికి సంబంధించి పనులను మంత్రి సమీక్షించారు. 




ప్రస్తుతం నాలుగున్నర మీటర్ల ఎత్తు మొదటగా ఈ వాల్స్‌ నిర్మించిన తర్వాత మరో ఎత్తులో మరో వాల్‌ నిర్మించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వానకాలంలోగా సాధ్యమైనంత మేరకు వాల్స్‌ నిర్మించేలా ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ చెబుతోంది. నది లోతును పెంచేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో చేపడుతున్న పనులు ఏడాదిన్నరలోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ పనులకు సమాంతరంగా రూ.80 కోట్ల వ్యయంతో చెక్‌ డ్యాంలు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో వాటర్‌ ఫౌంటెయిన్, బోటింగ్‌, కాటేజీలతోపాటుగా ప్రపంచ స్థాయిలో థీమ్‌ పార్కులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.