Karimnagar News : వారంతా ఎలాంటి ఉపాధి లేని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు. ఏదైనా వినూత్నమైన బిజినెస్ తో  తమకు ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు ప్రజలకు కూడా మేలు చేయాలనుకున్నారు. దానికి అనుగుణంగానే పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. ఎక్కడలేని విధంగా మిల్లెట్స్ వాడి ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. అంతే ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వారికి సంబంధించిన పూర్తిస్థాయి వ్యాపార మార్గదర్శనం కోసం అధికారులతో సంప్రదించడమే కాకుండా మిల్లెట్స్ సంబంధించి వినూత్నంగా బిస్కెట్లు, కేకులు తయారీ ప్రారంభించారు. ఇప్పుడు వీరి పరిశ్రమ కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు బయట రాష్ట్రాలకు కూడా విస్తరించి టేస్టీ స్నాక్స్ ని ఎగుమతి చేస్తోంది. అటు ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తోంది.


సిరిధాన్యాల బిస్కెట్లు, కేకులు 


ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మానకొండూరుకు చెందిన కొందరు మహిళలు కలిసి విజయశ్రీ JLB పేరుతో సిరిధాన్యాల బిస్కెట్లు, కేకుల తయారీ యూనిట్ ప్రారంభించారు. ముఖ్యంగా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల వంటి చిరుధాన్యాలను వాడి వినూత్నంగా బిస్కెట్లు తయారు చేయడం మొదలుపెట్టారు. దీనికి  జమ్మికుంటకు చెందిన ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా సాంకేతిక సహకారాన్ని తీసుకున్నారు. మరోవైపు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (SERP) అందిస్తున్నటువంటి వ్యాపార, మార్కెటింగ్ మెలకువలు పూర్తిస్థాయిలో నేర్చుకుని సేల్స్ కూడా మొదలుపెట్టారు. అయితే ప్రజల్లో అవగాహన కల్పించడానికి కొంత సమయం పట్టినా ఒకసారి డిమాండ్ ఊపందుకోవడంతో ప్రస్తుతం తమ బిజినెస్ బాగా నడుస్తోందని అంటున్నారు.


మార్కెటింగ్ లో కాస్త సమయం


ఇక వీటికి సంబంధించినటువంటి మెషినరీ బయట నుంచి తప్పించుకున్నామని, తయారీకి పూర్తి స్థాయిలో శిక్షణ పొందామని మహిళలు తెలిపారు. పెద్దగా సమస్యలు ఎదురుకానప్పటికీ మార్కెటింగ్ విషయంలో మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించడానికి కొంత సమయం పట్టిందని అంటున్నారు. మామూలు తినుబండారాలతో పోలిస్తే వీటితో తయారు చేసిన ప్రతి ఐటమ్ కూడా చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఎంతగానో తోడ్పడుతుందని వారంటున్నారు. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడం, అత్యంత తేలికగా జీర్ణం కావడంతో పాటు వెనువెంటనే ఎనర్జీ అందించే విధంగా తమ ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నామని మహిళలు చెబుతున్నారు. 



(గ్రూప్ సభ్యులు వసంత, పరిమి , రజిత)


విదేశాల నుంచి ఆర్డర్లు 


కరోనా కారణంగా కొంత ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేశామని, ప్రస్తుతం విదేశాల నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయని వారు చెబుతున్నారు. ప్రత్యేకించి రెండు సంవత్సరాల తర్వాత ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారని, ఆహారం విషయంలో ధర కూడా పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. ఇదే తమకు కలిసి వచ్చిందని ప్రీ ఆర్డర్ వల్ల తాము ముందుగానే ఎంత క్వాంటిటీ తయారు చేయాలో నిర్ణయించుకుని వాటిని తయారు చేస్తున్నామని అంటున్నారు.