జీప్ తన మెరీడియన్ ఎస్‌యూవీని మన దేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.29.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి కేవలం డీజిల్ ఇంజిన్ వేరియంట్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. టాప్ ఎండ్ జీప్ కంపాస్‌కి, జీప్ మెరీడియన్‌లకు మధ్య ధర తేడా ఎక్కువగా ఏమీ లేదు. అంటే జీప్ ధర విషయంలో ఇదే రేంజ్‌లో ఉన్న మిగతా కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందన్న మాట.

జీప్ కంపాస్ ప్లాట్‌ఫాంపైనే దీన్ని రూపొందించారు. కేవలం దాన్ని సాగదీసినట్లు మాత్రమే కాకుండా కొత్త లుక్ ఉన్న ఇంటీరియర్ కూడా ఇందులో ఉంది. కంపాస్ తరహాలో కాకుండా ఇందులో కేవలం డీజిల్ ఇంజిన్ మాత్రమే అందించారు. ఈ కారులో 2.0 లీటర్ టర్బోచార్జ్‌డ్ మోటార్ ఉంది. ఇది 170 హెచ్‌పీ, 3750 ఆర్పీఎంను అందించనుంది. దీని పీక్ టార్క్ 350 ఎన్ఎంగా ఉంది.

సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, నైన్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో జీప్ మెరీడియన్ కొనుగోలు చేయవచ్చు. 4x2, 4x4 మోడల్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4x2 ఆటోమేటిక్ వేరియంట్ వైపు కొనుగోలుదారులు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది.

మెరీడియన్ డీజిల్ వేరియంట్ అధికారికంగా 16.2 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. లిమిటెడ్, లిమిటెడ్ (O) ట్రిమ్స్‌లో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. ఈ మూడు వరుసల ఎస్‌యూవీలో ఐదుగురు కూర్చుంటే 481 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. మొత్తం ఏడు సీట్లలోనూ కూర్చుంటే 170 లీటర్ల బూట్ స్పేస్ లభించనుంది.

లెదర్ సీట్లు, మూడో వరుసలో కూర్చున్న వారికి కూలింగ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, డైమండ్ కట్ డ్యూయల్ టోన్ 18 అంగుళాల అలోయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి. లిమిటెడ్ (O) వేరియంట్లో టూ-టోన్ రూఫ్, డ్యూయల్-పేన్ సన్‌రూఫ్, 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీల కెమెరా ఫీచర్లు ఉన్నాయి.

టోయోటా ఫార్చ్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే జీప్ మెరీడియన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మనదేశంలో ఫార్చ్యూనర్ ధర రూ.34.29 లక్షల నుంచి రూ.48.43 లక్షల మధ్య ఉంది. స్కోడా కోడియాక్‌తో జీప్ మెరీడియన్ పోటీ పడనుంది. ఇది కూడా పెట్రోల్ ఇంజిన్‌లోనే అందుబాటులో ఉంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?