Minister Harish Rao : తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ కోసం డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితులు మంత్రికి ఫిర్యాదు చేశారు. వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఆ డాక్టర్ పై అక్కడిక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కటిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. గైనకాలజీ వార్డులో ప్రతి రోజూ స్కానింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అదంగా రెండు అల్ట్రా సౌండ్ మిషన్లు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. గైనకాలజీ వార్డులో సదుపాయాలను పరిశీలించిన మంత్రి, 60 శాతం పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ డెలివరీ సంఖ్య ఇంకా పెంచాలని సూచించారు. ఆసుపత్రిలో తిరుగుతూ వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, సదుపాయాలు ఎలా ఉన్నాయని పేషెంట్లను మంత్రి అడిగితెలుసుకున్నారు.
కొత్త వేరియంట్ పై మంత్రి ఏమన్నారంటే?
హైదరాబాద్ లో వేరియంట్ కేసు నమోదుపై మంత్రి హరీశ్ రావు ఆదివారం స్పందించారు. కరోనా కొత్త వేరియంట్ తో ప్రమాదమేమి లేదన్నారు. రూ.100 కోట్లతో గాంధీ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.30 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధునాతన యంత్రాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. సంతాన సాఫల్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. డ్రైనేజీ, ఫైర్ సెఫ్టీ, డ్రింకింగ్ వాటర్, పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఎక్కువ ఖర్చుచేసుకోవద్దని సూచించారు. డీజిల్, పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించడం బోగస్ అని వ్యాఖ్యానించారు.
గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలు
గాంధీ ఆసుపత్రిలో రూ.13 కోట్ల విలువైన అత్యాధునిక ఎంఆర్ఐ మెషీన్, రూ.9 కోట్ల విలువైన క్యాత్ ల్యాబ్‌ను ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి ఆదివారం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కొత్త వేరియెంట్ కేసు నమోదు కావడంపై మాట్లాడిన ఆయన కొత్త వేరియెంట్ వల్ల ప్రమాదం లేదన్నారు. కొత్త వేరియంట్ కేసు ఒకటి నమోదు అయిందని, ఆ వ్యక్తి కాంటాక్ట్‌లను పరీక్షించామన్నారు. ఎలాంటి పాజిటివ్ కేసులు రాలేదని స్పష్టం చేశారు. రూ.30 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ థియేటర్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని, దీని ద్వారా ఆరు రకాల అవయవాల మార్పిడి చేయొచ్చున్నారు. సంతాన సాఫల్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.