బుద్ధి, బలం,జ్ఞానం, సమయస్ఫూర్తి, విజయం ఇవన్నీ ఆంజనేయుడిని పూజిస్తే వస్తాయంటారు. రామభక్తుడిని కొలిచేందుకు చాలా మంత్రాలున్నాయి అయితే..అన్నటి కన్నా హనుమాన్ జయమంత్రం పఠిస్తే చాలు ఎంతటి కష్టమైనా పారిపోతుందంటారు.  దీనిని వాయుపత్రుడు ఏ సందర్భంగా చెప్పాడంటే.. లంకలో ఆశోకవనంలో ఉన్న సీతాదేవిని...రామబంటు హనుమంతుడు చూస్తాడు. రాక్షసులెవ్వరూ లేని సమయం చూసి వెళ్లి మాట్లాడి ఆమెకు ధైర్యం చెబుతాడు. అయితే ఇదంతా చూసిన కొందరు రాక్షస స్త్రీలు ఏదో కోతి వచ్చి మీరు తీసుకొచ్చిన మహిళతో మాట్లాడుతోందని చెబుతారు. ఆగ్రహించిన రావణుడు 80 వేల మంది రాక్షస కింకరులని పిలిచి ” మీరందరూ వెళ్ళి ఆ మహా వానరాన్ని పట్టి బంధించండి, లేకపోతె సంహరించండి ” అని చెప్పి పంపించాడు. వాళ్లంతా వెళ్లేసరికి హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని శ్లోకం చెప్పాడు. దానినే హనుమాన్ జయమంత్రం అంటారు. ఇది సుందరకాండలో ఓ ఘట్టం...


హనుమాన్ జయమంత్రం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||


రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి అండతో  వానర రాజైన సుగ్రీవుడు జయంతో శోభిల్లుతున్నాడు. అలాంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో ప్రత్యేక ఆయుధాలను వినియోగించను. ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు ” అని జయ మంత్రాన్ని చెప్పాడు. 


Also Read: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా


అప్పుడా 80వేల మంది కింకరుల మూక హనుమంతుడి మీదకి లంఘించారు. ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిఘని ఒకదాన్ని పీకి వాళ్ళందరినీ చితక్కొట్టాడు హనుమంతుడు.  కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్న ఆంజనేయుడికి దూరంగా వెయ్యి స్తంభాలతో ఓ ప్రాసాదం కనపడింది. అప్పుడాయన ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు. ఆ నాదం వినేసరికి లంకా పట్టణంలో కొన్ని వేలమంది గుండెలు బద్దలయ్యి, చెవుల వెంట, ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు. అప్పుడాయన తొడలు కొట్టాడు, ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిర తిప్పితే, ఆ వేగానికి అందులోనుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది. ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న 100 మంది రాక్షసులని కూడా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఆంజనేయుడు ఏమన్నాడంటే...   మా వానరాల్లో 10 ఏనుగుల బలం కలిగినవారు, 100 ఏనుగుల బలం కలిగినవారు, 1000 ఏనుగుల బలం కలిగినవారు, 10,000 ఏనుగుల బలం కలిగినవారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగినవారు ఉన్నారు. భూమికి అడ్డంగా ఎగరగలిగేవాళ్ళు, నిలువుగా ఎగరగలిగేవాళ్ళు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు, వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టిననాడు, ఈ లంక లేదు, మీరు లేరు, ఆ రావణుడు లేడు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు ” అని చెప్పి మళ్ళి తోరణం మీదకి వచ్చి జయ మంత్రం చెప్పాడు.


అమ్మకొట్టింది, నాన్న తిట్టాడు, ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులొచ్చాయనో ఫెయిలయ్యామనో ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు పిల్లలు. అసలు కష్టం అంటే ఎలా ఉంటుందో, ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్లకి నచ్చేలా కథల రూపంలో చెప్పడం, ఇలాంటి శ్లోకాలు చదివించడం వల్ల కొంతైనా వారి ఆలోచనా విధానం మారుతుందంటారు పండితులు. 


Also Read:హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి


Also Read:  అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి