రామాయణంలో ఉన్న ఏడుకాండల్లో సుందరకాండ అత్యంత విశిష్టమైనదని చెబుతారు పండితులు. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకుని, సీతను వెతికి, లంకకు నిప్పుపెట్టిన తర్వాత..సీతమ్మతల్లి ఎక్కడుందనే విషయాన్ని తిరిగి శ్రీరాముడికి చేరవేసేందుకు వెళతాడు ఆంజనేయుడు. ఈ మొత్తం సారాంశమే సుందరకాండ. సుందరకాండలో ప్రతిపదం, ప్రతి శ్లోకం, మంత్రబద్ధమై ఉంటుంది. దీనిని భక్తితో చదివినా, విన్నా, నిత్యం పారాయణం చేసినా, ప్రవచించినా...అన్ని సమస్యలు తొలగిపోయి జీవితంలో ప్రశాంతత నెలకొంటుందని భక్తుల విశ్వాసం. రోగాలు తొలగడమే కాదు మృత్యభయం కూడా మాయమైపోతుందని పండితులు చెబుతారు.
సుందరే సుందరో రామః సుందరే సుందరీకథా
సుందరే సుందరీ సీతా సుందరే వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః
సుందరే సుందరం మంత్రం సుందరే కింన సుందరమ్
శ్రీమద్రామాయణంలోని సుందర కాండ గురించిన సుప్రసిద్ధ చెందిన శ్లోకమిది. వాల్మీకి రామాయణంలో సుందరకాండకే ఎందుకు అంత ప్రాముఖ్యముందనే ప్రశ్నకు సమాధానమీ శ్లోకం. సుందరకాండలో వర్ణించిన శ్రీరామచంద్రుడు పరమ సుందరుడు, అందులోని కథ పరమ సుందరం, సీతాదేవి పరమ సుందరి, ఆమె ఉన్న వనం పరమ సుందరమైనది, కావ్యం మరింత సుందరమైనది, హనుమంతుడు సుందరుడు, మంత్రం కూడా సుందరమే. ఈ కాండలో సుందరం కానిది ఏమున్నది? అని శ్లోకార్థం.
సుందరకాండలో ఏం చదివితే ఏం ప్రయోజనం
- లంకా విజయం చదివితే భూత-ప్రేతాదుల భయంతో ఉన్నవాళ్లను హనుమంతుడు రక్షిస్తాడట
- హనుమ నిర్వేదం చదివితే బుద్దిమాంద్యం సమస్యలున్నవారికి ఆ సమస్య తొలగుతుంది
- లంకలో సీతాన్వేషణ ఘట్టం చదివితే ఇతరులు వల్ల మనపై కలిగే దోషాలు తొలగిపోతాయి
- లంకలో సీతమ్మను హనుమ చూసిన ఘట్టం చదివితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది
- త్రిజటా స్వప్న వృత్తాంతం చదివితే చెడ్డ కలల వల్ల కలిగే దోషాలు పోతాయి
- సీతారావణ సంవాదం చదివితే మంచి బుద్ధి కలుగుతుంది
- సీతా హనుమ సంవాదం చదివితే దూరమైపోయిన బంధువులు తిరిగి కలుస్తారు
- అంగుళీయక ప్రదానం చదివితే కష్టాలు తగ్గుతాయి
- కాకానుగ్రహం చదివితే తెలిసీ తెలియక ఎప్పుడైనా రాముడి విషయంలో ఏదైనా తపోయూ చేసి ఉంటే అవి తొలగిపోతాయి
- చూడామణి ప్రదానం చదివితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది
- రాక్షసులను హనుమ వధించిన ఘట్టాలు చదివితే శత్రువుల మీద విజయం సాధిస్తారు
- లంకాదహన ఘట్టం చదివితే ఇంట్లోనూ, వ్యవసాయ పనుల్లో అభివృద్ధి కలుగుతుంది
- మధువన ధ్వంసం చదివితే ఆ పుణ్యం వల్ల మరణం తరువాత బ్రహ్మలోకానికి వెళతారు
- సీతా సందేశాన్ని రాముడికి నివేదించడం చదివితే అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి
- 68 రోజుల పారాయణం చేస్తే సంతాన లేమి సమస్య తీరుతుంది
- పెళ్లికాలేదని బాధపడేవారు నిత్యం సుందరకాండ పారాయణం చేస్తే ఉత్తమ జీవిత భాగస్వామి దొరుకుతారు
- అంగుళీయక ప్రదానం చదివితే తలపెట్టిన పనుల్లో విజయం సొంతం అవుతుంది
- బ్రహ్మాస్త్ర బంధం నుంచి విముక్తి, హనుమద్గ్రహణం చదివితే శనిబాధలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది
- నిత్య పారాయణం చేస్తే అన్ని పనులలో విజయం కలుగుతుంది, అలాగే అన్ని విధాలుగా శుభం కలుగుతుంది.
సుందరకాండ చదివేచోట రాముడు ఎల్లప్పుడూ ఉంటాడు, అలాగే రాముడి గురించి పూజలు జరిగేచోట హనుమంతుడు ఉంటాడని భక్తుల విశ్వాసం.
Also Read: హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి
Also Read: అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి