Krishna Janmashtami 2023


అమ్మ కడుపులో పడకముందే శత్రువు కాచుకుకూర్చున్నాడు
అర్థరాత్రి చెరసాలలో జన్మించాడు
పుట్టిన వెంటనే కన్నవారికి దూరంగా పెరిగాడు
రాజభోగాలు అనుభవించాల్సిన బాల్యం ఆలమందల మధ్య గడిచింది
అడుగుకో గండం.. ఎప్పటికప్పుడు ప్రాణాలు నిలబెట్టుకుంటూనే ఉన్నాడు
ఒక్క మాటలో చెప్పాలంటే దినదినగండం నూరేళ్లు ఆయుష్షు అన్నట్టు గడిచించి కన్నయ్య జీవితం... అయినప్పటికీ ఎక్కడా తగ్గేదే లే అన్నట్టు బతికి చూపించాడు సంతోషంగా ఎలా బతకాలో నేర్పించాడు. 


బాల్యంలో అల్లరి మానలేదు, యవ్వనంలో చిలిపి పనులు ఆపలేదు..ఇంకా సోదరుడిగా, స్నేహితుడిగా, సన్నిహితుడిగా, ప్రేమికుడిగా, భర్తగా ఏ కోణంలో చూసినా కన్నయ్యను మించినవారెవరూ పురాణాల్లో కనిపించరేమో. అంటే ఆనందతత్వం, ప్రేమతత్వం, స్నేహతత్వం, ప్రకృతితత్వం, నాయకత్వం ఇవన్నీ కలగలపితే శ్రీకృష్ణతత్వం. శ్రీ కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు.


Also Read: ద్వారక సముద్రంలో మునిగినప్పుడు మిస్సైన కృష్ణుడి విగ్రహం ఇప్పుడు ఎక్కడుందంటే!


సోదరిపై ప్రేమ పగగా మారిన క్షణం


రాజ్యాన్ని పాలించాలనే  కాంక్షతో మధురను పాలించే తండ్రి ఉగ్రసేనుడిని కారాగారంలో బంధించి అధికారం చేజిక్కించుకుంటాడు కంసుడు. సోదరి అంటే మాత్రం అంతులేని ప్రేమ. యాదవ రాజైన వసుదేవుడికిచ్చి వివాహం చేసిన కంసుడు తన సోదరిని అత్తవారింటికి సాగనంపేటప్పుడు స్వయంగా రథం నడుపుతాడు. మార్గమధ్యలో ఉండగా ఆకాశవాణి పిలుపు వినిపిస్తుంది. నీ సోదరిపై అంతులేని ప్రేమ చూపిస్తున్నావు కానీ తనకు పుట్టే ఎనిమిదో సంతానం చేతిలో నీ చావు తప్పదనే మాట వినిపిస్తుంది. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన కంసుడికి సోదరిపై ఉన్న ప్రేమంతా పగగా మారింది. అప్పటివరకూ ఎందుకు ఇప్పుడే చంపేస్తానంటూ దేవకిపై కత్తి ఎత్తుతాడు. వసుదేవుడు కాళ్లపై పడి వేడుకోవడంతో పాటూ..తనకు పుట్టిన పిల్లల్ని పురిటిలోనే అప్పగిస్తానని చెప్పడంతో సరే అంటాడు.  అప్పటికి కాస్త ఆవేశం తగ్గడంతో చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో గుర్తొచ్చి చంపకుండా వదిలిపెట్టి గృహనిర్బంధంలో ఉంచుతాడు. అప్పటి నుంచి దేవకి-వసుదేవులకు పుట్టిన సంతానాన్ని చంపుతూ వస్తుంటాడు. ఏడుగురి వంతు అయిపోయింది. అష్టమ సంతానం భూమ్మీదపడే సమయం ఆసన్నమైంది.


Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి సెప్టెంబరు 6 or 7 - ఎప్పుడు జరుపుకోవాలి! 


ఆ అర్థరాత్రి జరిగిన అద్భుతాలెన్నో  


సరిగ్గా అర్థరాత్రి సమయం. ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షం. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. మత్తు ఆవహించినట్టు కాపలా వాళ్లంతా ఎక్కడికక్కడ కూలబడిపోయారు. వసుదేవుడిని బంధించిన సంకెంళ్లు వాటంతట అవే తెగిపోయాయి. ఇదంతా దైవలీల అని దేవకీ వసుదేవులకు అర్థమైంది. శ్రీ కృష్ణుడు భూమ్మీద పడిన వెంటనే ఎవరో మార్గదర్శకత్వం చేసినట్టు వసుదేవుడు ఆ బిడ్డను ఎత్తుకుని యమునా నదివైపు వెళ్లాడు. వరదనీరు పారుతున్న సమయంలో అలా నది మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్లి తన స్నేహితుడు నందుడి ఇంట యశోద పక్కన పడుకోబెట్టి అక్కడున్న ఆడపిల్లను తిరిగి తీసుకొచ్చి దేవకి పక్కన పెడతాడు. అప్పుడు వాతావరణం మొత్తం మారిపోయింది. కాపలా సైనికులు నిద్రలేచారు..పసిబిడ్డ ఏడుపు వినిపించడమే తడువు కంసుడు రానే వచ్చాడు. మగపిల్లాడు అయితే నిన్ను చంపేసేవాడేమో ఆడపిల్ల కదా వదిలేయమని ప్రాధేయపడ్డారు ఆ దంపతులు. కానీ కంసుడు కరుణించలేదు ఎప్పటిలా చిన్నారిని పైకి వేసిరి కత్తి అడ్డం పెట్టాడు.. కానీ ఆ చిన్నారి అట్నుంటి అటే మాయమై నిన్ను చంపేవాడు పెరుగుతున్నాడని చెబుతుంది. అప్పటి నుంచి కృష్ణుడిని అంతం చేయడానికి కంసుడు చేయని ప్రయత్నం లేదు. 


అవతారం చాలించే వరకూ కష్టాలే


దొరికిన ప్రతి శిశువునూ ఖండ ఖండాలుగా నరికి చంపాడు. ఎంతోమంది రాక్షసులను బాలకృష్ణుడుని సంహరించడానికి పంపాడు. కానీ వారంతా కృష్ణుడి చేతిలో హతమయ్యారు. ఆ తర్వాత కంసుడు మల్ల యుద్ధంలో ఆరితేరిన యోధుల్ని దించుతాడు. వారిని కూడా బలరామకృష్ణులు భీకరంగా ఎదుర్కోవడమే కాకుండా ప్రాణాలు తీసేస్తారు. అప్పటికి కంసుడికి అర్థమవుతుంది తన ప్రాణం పోవడం ఖాయం అని.  అలా ప్రాణభయంతో ఉ్న కంసుడిని జుట్టు పట్టుకుని సింహాసనం మీది నుంచి కిందికి తోసి తలనరికి సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడి కష్టాలు ఇక్కడితో అయిపోలేదు. శ్రీకృష్ణుడు అవతారం చాలించే వరకూ అడుగడునా కష్టాలే...అయినా ఏనాడూ ముఖంపై చిరునవ్వు చెరగలేదు, ఏ సమస్య నుంచీ పారిపోలేదు. కష్టాలు పడుతున్నా అనుకోలేదు. ఎదురైన ప్రతి కష్టం నుంచి బయటపడుతూ అడుగుతో పాఠం నేర్పిస్తూ సాగిపోయాడు...


Disclaimer:ఇక్కడ అందించిన సమాచారం పండితుల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.