Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి ఆలయాల్లో ప్రధానంగా చెప్పుకునేవి నాలుగు. ఉత్తరప్రదేశ్-మథుర, గుజరాత్-ద్వారక, కేరళ- గురువాయూరు, కర్ణాటక-ఉడిపి. వీటిలో స్వయంగా రుక్మిణి విశ్వకర్మతో తయారుచేయించిన విగ్రహం కొలువైన ఆలయం ఉడిపి. ఇక్కడ ఆలయంలో చిన్ని కృష్ణుడు ఉంటాడు. మరి బాలకృష్ణుడిని భార్య రుక్మిణి తయారు చేయించడం ఏంటనే సందేహం తీరాలంటే దీనివెనుకున్న ఆసక్తికర కథనం తెలుసుకోవాలి...
 
మధ్వాచార్యుల చేతికి బలరామకృష్ణులు


త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు ఒకరోజు సముద్ర తీరంలో తపోదీక్షలో ఉండగా ఆ వైపు వస్తున్న నావ అలలకు పైపైకి లేచి ప్రమాదంలో చిక్కుకోబోయింది. ఆ సమయంలో మధ్వాచార్యులు తపోబలంతో తన దగ్గరున్న కండువాను ఆసరాగా విసిరి నావను ఒడ్డుకు చేర్చాడు. నావలో ఉన్నవారంతా కిందకు దిగిన తర్వాత  తమకు కాపాడినందుకు కృతజ్ఞతు తెలియజేశారు. అందుకు ప్రతిగా నావలో ఏదైనా విలువైన వస్తువుని తీసుకోమని కోరారు. అందుకు చిరునవ్వు నవ్విన మధ్వాచార్యులు పడవలో ఉన్న గోపీచందనపు గడ్డలు  ఇవ్వమని అడిగారు. ఆ మాటవిని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. విలువైన వస్తువులు తీసుకోమని చెబితే..ఎందుకూ పనికిరాని మట్టిగడ్డలు అడుగుతున్నారెందుకని ప్రశ్నించారు. వాటిని చేతిలోకి తీసుకున్న మధ్వాచార్యులు చప్పున నీటిలో ముంచారు. ఆ మట్టి మొత్తం కరిగిన తర్వాత బయటపడ్డాయి శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలు.


Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి సెప్టెంబరు 6 or 7 - ఎప్పుడు జరుపుకోవాలి!


రుక్మిణి తయారుచేయించిన విగ్రహాలివి 


కారాగారంలో జన్మించిన శ్రీ కృష్ణుడిని వసుదేవుడు గోకులంలో నందుడి ఇంట వదలిపెట్టాడు. అంటే శ్రీకృష్ణుడి బాల్యం మొత్తం గోకులంలోనే సాగింది. ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఓ సారి దేవకీదేవి శ్రీకృష్ణునితో... నీ బాల్య లీలను చూసే అదృష్టం యశోదకు కలిగించినట్టే తనకూ కలిగేలా చేయాలని కోరింది. అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు చిన్న పిల్లాడిలా మారిపోయి అన్న బలరాముడితో ఆడుకున్నాడు. అల్లరి కృష్ణుడి ఆటపాటలు చూసి దేవకితో పాటూ మురిసిపోయింది రుక్మిణి. ఆ క్షణాన్ని పదిలంగా ఉంచాలని భావించిన రుక్మిణి వెంటనే విశ్వకర్మని పిలిచి ఆడుకుంటున్న బలరామకృష్ణులను చూపించి విగ్రహాలు తయారుచేయాలని కోరింది. అలా తయారు చేయించిన విగ్రహాలు కృష్ణావతారం ముగిసి ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు నీటిలో కలసిపోయాయి.  ఆ తర్వాత ఇవే విగ్రహాలు మధ్వాచార్యుల చేతికి వచ్చాయి. ప్రస్తుతం ఉడిపిలో పూజలందుకుంటున్నది ఈ విగ్రహమే.


అభిషేకించిన తర్వాత బరువు పెరిగిన విగ్రహం


ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ బలరామకృష్ణులను ఉడిపికి ఆహ్వానించేందుకే మధ్వాచార్యులు ఆరోజు తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తన శిష్యులతో ప్రక్షాళన చేయించిన తర్వాత స్వయంగా అభిషేకించారు. అభిషేకానికి ముందు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యులు అభిషేకించిన తరువాత పదుల మంది కలసినా కనీసం కదపలేకపోయారు. అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడిందని చెబుతారు. విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ, సామాన్య శకం 1236లో ఉడిపిలో విగ్రహాలు ప్రతిష్ఠించారు.


Also Read: సెప్టెంబరు నెల ఈ రాశులవారికి అదృష్టాన్నిస్తుంది, ఆర్థికంగా కలిసొస్తుంది


పశ్చిమ ముఖంగా బాలకృష్ణుడు


అణువణువూ కృష్ణ నామస్మరణతో మారుమోగే ఈ ఆలయం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఒకప్పడు శ్రీకృష్ణమఠంగా, ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా పిలిచే ఈ ఆలయం కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించారు. ప్రధాన గోపురానికి ఎదురుగా కనకదాసు మందిరం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి భక్తుడైన కనకదాసే కారణం అని చెబుతారు. నిమ్న కులస్థుడైన కనకదాసు భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడ పశ్చిమాభిముఖంగా దర్శనమిచ్చినట్టు స్థలపురాణం. ప్రధానాలయంలో కుడివైపు భాగంలో శ్రీమద్వతీర్థం ఉంది. 


కిటికి ద్వారా కృష్ణుడిని దర్శించుకోవాలి


శ్రీకృష్ణుని లీలావిశేషాలు తెలిపే అందమైన తైలవర్ణ చిత్రాలు, కొయ్యశిల్పాలు ఇక్కడ భక్తులను ఆకట్టుకుంటాయి. గర్భాలయం ముందుభాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం,  దానికి సమీపంలో తీర్థ మండపం ఉంది. ఈ ఆలయంలో  భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. బాలకృష్ణుడిని కిటికీ ద్వారా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అంటారు.


Disclaimer:ఇక్కడ అందించిన సమాచారం పండితుల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.