పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 02) పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా తాజాగా ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'హరి హర వీరమల్లు' చిత్ర బృందం పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అర్ధరాత్రి గం. 12:17 నిమిషాలకు సరికొత్త పోస్టర్ ను సోషల్ మీడియాలో ఆవిష్కరించారు. ''ఈ సంతోషకరమైన రోజున, మన హరిహరవీరమల్లు యొక్క అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరిమితమైన కరుణను జరుపుకుంటున్నాము!'' అని పేర్కొన్నారు. ఈ పోస్టర్ లో పవన్ ను ఒక యోధుడిగా చూపించారు. ఇప్పటి వరకూ కోర మీసాలు, క్లీన్ షేవ్ తో కనిపించిన వీరమల్లు.. ఇందులో మాత్రం గుబురు గడ్డంతో కొత్త లుక్ లో కనిపించారు. ఇది సినిమాలో ఒక ఫైట్ సీన్ అని తెలుస్తోంది.
17వ శతాబ్దం నాటి మొఘలాయిలు - కుతుబ్ షాహీలకు సంబంధించిన చారిత్రక కథాంశంతో, ఒక యోధుడి వీరోచిత గాథతో 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతేడాది పవన్ కల్యాణ్ బర్త్ డే కానుకగా 'పవర్ గ్లాన్స్' పేరుతో గ్లింప్స్ వదిలారు. 'మెడల్ని వంచి, కథల్ని మార్చి.. కొలిక్కితెచ్చే పనెట్టుకొని.. తొడకొట్టాడో తెలుగోడు' అంటూ పవన్ ను పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. కానీ ఈ ఏడాది పుట్టినరోజుకు మాత్రం ఒక మోషన్ పోస్టర్ తోనే సరిపెట్టారు. అయినప్పటికీ ఇది ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
'హరి హర వీరమల్లు' అనేది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పీరియాడిక్ మూవీ. అంతేకాదు ఆయన కెరీర్ లోనే హై బడ్జెట్ ఫిల్మ్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూ. 150 - 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తుండగా.. ఈ సినిమాతో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. నర్గిస్ ఫక్రి, పూజిత పొన్నాడ, విక్రమజీత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. కె. ఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
'హరి హర వీరమల్లు' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాకపోతే ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనేది మేకర్స్ తాజా పోస్టర్ లో ప్రస్తావించలేదు. ఇటీవల నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగే దాన్ని బట్టి సినిమా రిలీజ్ ఉంటుందని తెలిపారు.
Also Read: డిజాస్టర్ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial